గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. రెండు కేటగిరిల్లో సత్తా చాటిన ఒకే చిత్రం

by  |
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. రెండు కేటగిరిల్లో సత్తా చాటిన ఒకే చిత్రం
X

దిశ, ఫీచర్స్ : చలనచిత్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైంది ‘ఆస్కార్‌’. ఆ‌ తర్వాత అంతటి ప్రాముఖ్యతను కలిగిఉన్నది ‘గోల్డెన్ గ్లోబ్స్’. ఈ అవార్డులు గెలుచుకున్న వారినే దాదాపు ఆస్కార్ కూడా వరిస్తుందనే వాదన లేకపోలేదు. ప్రతి ఏటా జనవరిలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, కరోనా నేపథ్యంలో.. 78వ గ్లోడెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలను సోమవారం (మార్చి 1న) న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో వర్చువల్‌‌గా నిర్వహించి మొత్తం 12 విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. కాగా ఉత్తమ చిత్రం (డ్రామా) విభాగంతో పాటు మరో మూడు నామినేషన్లు దక్కించుకున్న ‘నోమడ్‌లాండ్’.. రెండు అవార్డులు గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ కాంట్రవర్షియల్ షో ‘ద క్రౌన్’ నాలుగో సీజన్.. బెస్ట్ టెలివిజన్ సిరీస్ (డ్రామా)తో పాటు మూడు అవార్డులతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ‘నోమడ్‌లాండ్, ద క్రౌన్’ విశేషాలేంటో తెలుసుకుందాం.

అమెరికన్ జర్నలిస్ట్ జెస్సికా బ్రూడర్ 2017లో రచించిన నాన్-ఫిక్షన్ బుక్ ‘నోమడ్‌లాండ్ : సర్వైవింగ్ అమెరికా ఇన్ ద 21 సెంచరీ’ ఆధారంగా ‘నోమడ్‌లాండ్’ చిత్రం రూపొందింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చూపించలేదు కానీ, విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది. కాగా ఈ చిత్రానికి రచన, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించింది ‘చోలే జావో’. ఇప్పటికే 25కు పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందిన చిత్రం.. తాజాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్షన్ విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ సాధించింది. ఈ మేరకు దర్శకత్వ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న రెండో మహిళగా చోలే జావో చరిత్ర సృష్టించింది. అమెరికన్ వెస్ట్ చుట్టూ ప్రయాణించడానికి ఇంటి నుంచి బయలుదేరిన ఓ మహిళ కథే ఈ చిత్రం కాగా, ఈ పాత్రలో ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్ నటించింది.

నోమడ్‌లాండ్ కథ :

2011లో తలెత్తిన ప్రపంచ మాంద్యం నేపథ్యంలో.. నెవాడా సిటీలోని స్థానిక ‘జిప్సం గని’ మూసివేస్తారు. ఉపాధిలేక వందలాది మంది వలస వెళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఈ టైమ్‌లోనే ఆ సంస్థలో పనిచేసిన ఫెర్న్ అనే మహిళ భర్త చనిపోవడంతో తన జీవితంలో ఒక్కసారిగా అంధకారం అలుముకుంటుంది. తను ఒంటరి కావడంతో వస్తువులన్నీ అమ్మేసిన ఫెర్న్.. నివసించడానికి ఒక వ్యాన్ కొనుక్కుని, పని కోసం వెతుకుతూ దేశంలో పర్యటించాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే అమెజాన్‌లో సీజనల్ ఎంప్లాయ్‌గా చేరి, వ్యాన్‌లోనే తిరుగుతూ దాన్నే నివాసంగా మార్చుకుంటుంది. సీజనల్ ఎంప్లాయ్ కావడంతో, తీరిక సమయాల్లో రోడ్లపైనే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది తన మనుగడ కోసం ఆమె ఎంచుకున్న ఓ మార్గం కాగా, ఈ క్రమంలోనే వివిధ సంచార జాతులను కలుస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటుంది.

డబ్బులేనివాళ్లు, ముఖ్యంగా ఒంటరైన వృద్ధులతో పాటు సామాజిక భద్రత కొరవడినప్పుడు ప్రత్యామ్నాయ జీవన విధానం ఎన్నుకున్న ఎంతోమంది జీవితాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. పూర్తిగా ఫెర్న్ ప్రయాణం గురించి చూపెట్టిన సినిమాలో.. సంచార జీవితం గడిపేవారి కష్టాలతో పాటు ఆనందాలను కూడా చూడొచ్చు. రోడ్ ట్రావెలింగ్ కథాంశంతో తెరకెక్కిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీనే. ఈ సినిమాల్లో కూడా ఉషోదయాలు, సూర్యాస్తమయాలు, నీలాకాశాలు, నీలిసంద్రాలు అన్నీ అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనిషి జీవితం కూడా వలస జీవితమే. భూమ్మీదకు టెనెట్‌లా వచ్చిన మనం.. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను, కష్టసుఖాలను అనుభవిస్తాం. ఒంటరిగా వస్తాం. ఒంటరిగానే వెళ్లిపోతాం. ఈ కాన్సెప్ట్‌ను తెరమీద ఆవిష్కరించడంలో చోలే జావో దర్శకత్వ ప్రతిభ, మెక్డోర్మాండ్ నటన కచ్చితంగా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.

ఎలిజిబెత్ రహస్య ప్రేమాయణం ‘ద క్రౌన్’

క్వీన్ ఎలిజబెత్ II పాలన, ఆమె జీవిత విశేషాల ఆధారంగా వచ్చిన టెలివిజన్ ధారావాహిక ‘ది క్రౌన్’. ప్రముఖ బ్రిటీష్ స్క్రీన్ రైటర్, ప్లే రైటర్ పీటర్ మోర్గాన్ ఈ సినిమాకు స్టోరీని అందించగా, మొత్తం ఆరు సీజన్లు గల ధారావాహిక ఇప్పటి వరకు నాలుగు భాగాలుగా విడుదలైంది. మొదటి సీజన్‌లో ఎలిజబెత్ వివాహం (1947) నుంచి 1955‌లో గ్రూప్ కెప్టెన్ పీటర్ టౌన్సెండ్తో, ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ నిశ్చితార్థం విచ్ఛిన్నం వరకు ఉంటుంది. తొలి సీజన్ 2016 నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది. ఇక1956-1963 కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలను చూపించిన రెండో సీజన్‌ 2017 డిసెంబర్ 8న విడుదలైంది. 1964 – 1977 టైమ్ పీరియడ్‌‌కు సంబంధించిన మూడో సీజన్ 2019, నవంబర్ 19న రిలీజైంది. 1979 నుంచి1990 ఆరంభం వరకు గల నాల్గో సీజన్ 15 నవంబర్ 2020న విడుదల కాగా, ఇందులో మార్గరెట్ థాచర్ ప్రధానమంత్రిగా బాధ్యతల స్వీకరణ, ప్రిన్స్ చార్లెస్‌తో లేడీ డయానా స్పెన్సర్స్ వివాహ విశేషాలున్నాయి. కాగా రాబోయే ఐదు, ఆరో సీజన్లలో 21వ శతాబ్దంలో రాణి పాలనకు సంబంధించిన విషయాలను చూపించనున్నారు.

అవార్డు గెలుచుకున్న నాలుగో సీజన్ విషయానికొస్తే.. లెఫ్ట్ బ్యాంక్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఈ సిరీస్‌ను నిర్మించింది. కథ విషయానికి వస్తే.. మార్గరెట్ థాచర్ (గిలియన్ అండర్సన్) పెరుగుదలతో పాటు పతనాన్ని చూసిన దశాబ్దం(1980-90) ఇది. యువరాణి డయానా (ఎమ్మా కొరిన్), ప్రిన్స్ చార్లెస్‌‌ను వివాహంతో పాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఇందులో చూపించారు. ఇక వీక్షకుడికి వీరి చరిత్ర తెలిస్తే, ‘ది క్రౌన్‌’లో థాచర్ చర్యలు ఆశ్చర్యం కలిగించవు. కానీ ఇక్కడ అందించిన క్యారెక్టరైజేషన్, గిలియన్ అండర్సన్ పనితీరు ఈ సీజన్‌లో ఆమెను అత్యంత ఫోర్స్‌ఫుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మార్గరెట్ థాచర్, ప్రిన్సెస్ డయానా, ప్రిన్సెస్ మార్గరెట్‌ల జీవితాల్లోని ప్రధాన ఘట్టాలతో నాలుగో సీజన్‌ కథ నడుస్తుంది.

Next Story