వెండితెరపై నల్లమల బిడ్డ.. రేపు రామ్ అసుర్‌ విడుదల

by  |
వెండితెరపై నల్లమల బిడ్డ.. రేపు రామ్ అసుర్‌ విడుదల
X

దిశ, నాగర్‌కర్నూలు: సినిమా ఓ అద్భుతమైన కలల ప్రపంచమని.. ఆ సినిమాలంటే ఎంతో ఆసక్తి అతడికి. ఎలాగైనా తెరమీద కనిపించే స్థాయికి ఎదగాలనుకున్నాడు. సినిమా రంగ ప్రవేశం కోసం అంది వచ్చిన అవకాశాలను (చిన్న చిన్న పాత్రలు) చేస్తూ చివరకు అనుకున్నది (హీరో అయ్యాడు) సాధించాడు. రామ్ అసుర్‌లో మంచి పాత్రను పోషించి అంతర్జాతీయ స్థాయిలో అందరి మెప్పు పొందుతున్నాడు అభినవ్ సర్దార్. ఈ సినిమాను తొలుత ఓటీటీలో ప్రసారం చేద్దామనుకున్నప్పటికీ, రేపు (నవంబర్ 19) అంతర్జాతీయంగా థియేటర్లో విడుదలకు సిద్ధమైంది.

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బక్క లింగయ్య పల్లి గ్రామానికి చెందిన నాజీ గుండయ్య దంపతుల కుమారుడు అభినవ సర్దార్. అత్యంత బీదరికంలో ఉన్న వీరు పిల్లల్ని చదివించడానికి అనేక కష్టాలు పడ్డారు. అలాంటి పేద కుటుంబం నుంచి హీరోగా ఎదగడంతో అందరూ గర్విస్తున్నారు. తమ కుమారుడు సినిమా బిగ్ స్క్రీన్‌లో కనిపిస్తాడని ఏనాడు కలలో కూడా ఊహించలేదని.. కానీ తన పట్టుదలతో అనుకున్నది సాధించాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా అందరినీ అలరించాడు అభినవ్ సర్దార్. తేజం, రాక్షసి, హార్మోనిస్, ఈకే వంటి సినిమాల్లో అలరించినప్పటికీ, పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. కానీ, ప్రస్తుతం తీసిన రామ్ అసుర్ సినిమా సందేశాత్మకంగా తెరకెక్కిందని చెబుతున్నారు. కేవలం ఓటీటీలో రిలీజ్ అయితే చాలనుకున్న తరుణంలో రేపు అంతర్జాతీయ స్థాయిలో అన్ని సినిమా హాల్లోనూ సందడి చేయనుందని హీరో అభినవ్ సర్దార్ దిశతో తెలిపారు.


Next Story