దారుణం.. ఈ రోడ్డుపై టూవీల‌ర్ కూడా వెళ్లలేదు

by  |
abdhulla-poor-met1
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు తుర్కయంజాల్‌, పెద్ద అంబ‌ర్‌పేట మున్సిపాలిటీల‌ను అత‌లాకుతలం చేశాయి. వారంరోజులపాటు వ‌ర‌ద‌ల‌తో త‌ల్లడిల్లిన‌ ప‌లు కాల‌నీలు, లోత‌ట్టు ప్రాంతాలు ఇంకా తేరుకోలేక‌పోతున్నాయి. ఇంజాపూర్‌లో రూ.100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు నీటి ముంపులోనే ఉన్నాయి. మాసాబ్‌చెరువు బ్యాక్ వాట‌ర్‌లో ఆదిత్యనగ‌ర్‌, గంగ‌రాయిచెరువు బ్యాక్ వాట‌ర్‌లో రాఘ‌వేంద్ర కాల‌నీ ఇంకా తేలియాడుతూనే ఉన్నాయి.

బురద, ఇసుకతో అవస్థలు

మాసాబ్ చెరువు అలుగు నుంచి వ‌ర‌ద భారీగా పార‌డంతో ప‌లు కాల‌నీలు, అపార్ట్‌మెంట్లు, రోడ్లపై ఇసుక, బురద చేరుకుంది. దీన్ని ఎత్తిపోయ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో చెప్పలేని ద‌య‌నీయ ప‌రిస్థితి అక్కడ నెల‌కొంది. ఇప్పటికీ తూము నుంచి పెద్ద ఎత్తున‌ నీళ్లు వ‌స్తుండ‌టంతో డ్రైనేజీలు, మ్యాన్ హోళ్ల నుంచి నీరు ఉప్పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్లు జ‌నాలు న‌డ‌వ‌డానికి వీల్లేకుండా మారిపోయాయి.

ఇంకా బాగు చేయ‌లేదు

భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇంజాపూర్‌- తొర్రూరు, మున‌గనూరు-తొర్రూరు, మున‌గ‌నూరు-హ‌య‌త్‌న‌గ‌ర్‌, పెద్ద అంబ‌ర్‌పేట‌-తొర్రూరు, పెద్ద అంబ‌ర్‌పేట‌-కోహెడ మ‌ధ్య ప‌లు రోడ్లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని రోడ్లకు తాత్కాలిక మ‌రమ్మతులు చేసినా పెద్ద అంబ‌ర్‌పేట‌-తొర్రూరు మ‌ధ్య రోడ్డును ఇంకా బాగు చేయ‌లేదు. ఈ రోడ్డుపై టూవీల‌ర్ కూడా వెళ్లలేని ప‌రిస్థితి ఉంది.

ఇవాళ అధికారుల ప‌రిశీల‌న‌

మాసాబ్‌చెరువు కాలువ‌లు క‌బ్జాకు గుర‌య్యాయ‌ని, వ‌ర్షాలు, వ‌ర‌దలు వ‌చ్చిన‌ప్పుడు యాపిల్ ఎవెన్యూ కాల‌నీ, ఇందిర‌మ్మ కాల‌నీ, డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు జ‌ల‌మయ‌మై ప్రజలు ఇబ్బంది ప‌డుతున్నామని కలెక్టర్ కు, ఆర్డీవోకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆర్డీవో నేతృత్వంలో ఇరిగేష‌న్‌, జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ అధికారుల బృందం గురువారం స‌మీక్ష నిర్వహించింది. నేడు చెరువు ప‌రిస‌రాలు, క‌బ్జాకు గురైన కాలువ‌ల‌ను, తెగిన రోడ్లను ఈ బృందం ప‌రిశీలించ‌నుంది. మాసాబ్‌చెరువు అలుగు నుంచి నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా కాలువ‌ల‌ను నిర్మించే ప్రక్రియపై అధికారులు స‌మీక్షించ‌నున్నారు.



Next Story

Most Viewed