- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఢిల్లీపై గుజరాత్ భారీ విజయం.. ప్లే ఆఫ్స్‌కు గిల్ సేన క్వాలిఫై
ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడంతో గుజరాత్‌కు నాకౌట్ బెర్త్ దక్కింది. ఢిల్లీ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ముందుగా ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. ఆ తర్వాత 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19వ ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్(108 నాటౌట్), గిల్(93 నాటౌట్) దంచికొట్టడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 205 రన్స్ చేసి విజయతీరాలకు చేరింది. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
ఓపెనర్లే పూర్తి చేశారు
200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్లే విజయాన్ని కట్టబెట్టారు. క్రీజులో పాతుకపోయిన వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను వదలకుండా పరుగులు పిండుకున్నారు. ముఖ్యంగా అక్షర్, నటరాజన్, దుష్మంత చమీరా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సుదర్శన్ ఫోర్లతో చెలరేగితే.. గిల్ సిక్సర్లతో అలరించాడు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని కరిగించారు. సుదర్శన్ 61 బంతుల్లో 108 రన్స్ చేసి అజేయంగా నిలువగా.. గిల్ 53 బంతుల్లో 93 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రాహుల్ శతకం వృథా
బౌలర్లు 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడటంలో విఫలమవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహల్ చేసిన శతకం వృథా అయ్యింది. ఓపెనర్‌గా వచ్చిన అతను చివరి వరకూ అజేయంగా నిలిచాడు. ఢిల్లీ 199 పరుగులు చేసిందంటే కారణం రాహుల్ మాత్రమే. మరో ఓపెనర్ డు ప్లెసిస్(5) దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ పొరెల్(30), కెప్టెన్ అక్షర్(25) ఎంతో సేపు క్రీజులో లేరు. అయినప్పటికీ రాహుల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. గుజరాత్ బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలు పట్టించాడు. 65 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉండటం గమనార్హం. మరో 4 సిక్సర్లు కూడా కొట్టాడు. రాహుల్ శతక్కొట్టడంతో గుజరాత్ ముందు పంజాబ్ 200 పరుగుల టార్గెట్ పెట్టగలిగింది. స్టబ్స్(21 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
రాహుల్@8,000
టీ20ల్లో కేఎల్ రాహుల్ 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 224 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్ సాధించిన అతను వేగంగా 8 వేల పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు కోహ్లీ(243 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును తాజాగా రాహుల్ బ్రేక్ చేశాడు. అలాగే, ఐపీఎల్లో రాహుల్ 5వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో కోహ్లీ(8), బట్లర్(7), క్రిస్ గేల్(6)తర్వాత ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు.






