బోణీ కోసం ఆ మూడు జట్లు ఎదురుచూపులు

by Dishanational3 |
బోణీ కోసం ఆ మూడు జట్లు ఎదురుచూపులు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 ప్రారంభమై వారం దాటింది. లక్నో, కోల్‌కతా మినహా అన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. అయితే, 10 జట్లలో ఇంకా మూడు జట్లు బోణీ కోసం ఎదురుచూస్తున్నాయి. గెలుపు ఖాతా తెరవని జట్లలో ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్ ఉండటం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇంకా గెలుపు రుచి చూడలేదు.

ముంబై హ్యాట్రిక్ ఓటమి నుంచి బయటపడేనా?

ఓటమితో సీజన్‌ను ప్రారంభించే సంప్రదాయం ఉన్న ముంబై ఈ సీజన్‌‌ను కూడా పరాజయంతోనే మొదలుపెట్టింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్‌లోనైనా బోణీ చేస్తుందనుకుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తప్పలేదు. సొంతగడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరుతో సంచలనం సృష్టించగా ఛేదనలో ముంబై పోరాడినా ఫలితం శూన్యం. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడటంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఆ జట్టు పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్‌‌తో తలపడనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న రాజస్థాన్‌ను ముంబై నిలువరిస్తుందో లేదో చూడాలి.

చెన్నయ్ జోరుకు ఢిల్లీ కళ్లెం వేసేనా?

ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బోణీ కోసం ఎదురుచూస్తోంది. ఆ జట్టు వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తయిన ఢిల్లీ.. గురువారం రాజస్థాన్‌‌పై కూడా బోణీ కొట్టలేకపోయింది. వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ వంటి వారు తమ స్థాయి ప్రదర్శన చేయకపోవడం జట్టుకు నష్టాన్ని కలిగిస్తున్నది. బౌలింగ్ పరంగా కూడా ఆ జట్టు లోపాలను అధిగమించాల్సి ఉంది. ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమి నుంచి బయటపడాలంటే చెన్నయ్‌పై సత్తాచాటాల్సిందే. ఈ నెల 31న ఢిల్లీ జట్టు వైజాగ్ వేదికగా చెన్నయ్‌ను ఢీకొట్టనుంది.

లక్నో గేర్ మార్చేనా?

లక్నో సూపర్ జెయింట్స్‌ గత రెండు సీజన్లలోనూ మంచి ప్రదర్శన చేసింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అయితే, ఈ సీజన్‌ను లక్నో ఓటమితో ప్రారంభించింది. దీంతో లీగ్‌లో గేర్ మార్చి విజయ బాట పట్టాలని చూస్తోంది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. డికాక్, రాహుల్, పడిక్కల్, దీపక్ హుడా, పూరన్, స్టోయినిస్‌లతో లక్నో బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. గత మ్యాచ్‌లో పూరన్, రాహుల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. డికాక్, పడిక్కల్, హుడా కూడా పుంజుకుంటే బ్యాటింగ్‌లో ఆ జట్టును నిలువరించడం కష్టమే. మరి, పంజాబ్‌పై లక్నో మెరుస్తుందో లేదో చూడాలి.


Next Story

Most Viewed