ఎన్నిసార్లు అదే తప్పు చేస్తావు పంత్.. మరోసారి రిపీట్ అయితే నిషేధమే

by Dishanational3 |
ఎన్నిసార్లు అదే తప్పు చేస్తావు పంత్.. మరోసారి రిపీట్ అయితే నిషేధమే
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో బ్యాడ్ న్యూస్. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కొనసాగించిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్‌ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించడం ఇది రెండోసారి.

తొలిసారిగా చెన్నయ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ రూ. 12 లక్షల జరిమానా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. రెండోసారి నిబంధన ఉల్లంఘించడంతో పంత్‌కు రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్‌తోసహా మిగతా తుది జట్టులో ప్లేయర్లపై రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది) ఫైన్ వేసినట్టు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

మూడోసారి ఢిల్లీ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే పంత్‌కు రూ. 30 లక్షలు జరిమానాతోపాటు ఒక్క మ్యాచ్ నిషేధం విధిస్తారు. అలాగే, తుది జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెడతారు. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 106 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఒక్క విజయం.. మూడు పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉన్నది. ఈ నెల 7న జరగబోయే తదుపరి మ్యాచ్‌లో ముంబైతో ఢిల్లీ తలపడనుంది.

Next Story