సాల్ట్ మెరుపుల్.. కోల్‌కతా చేతిలో ఢిల్లీ చిత్తు

by Dishanational3 |
సాల్ట్ మెరుపుల్.. కోల్‌కతా చేతిలో ఢిల్లీ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్‌లో తడబడింది. కోల్‌కతా చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. నాకౌట్ రేసులో ఉండాలంటే ఆ జట్టు మిగతా మూడు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిందే. సోమవారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 153/9 స్కోరు చేసింది. కుల్దీప్ యాదవ్(35) టాప్ స్కోరర్. కేకేఆర్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి(3/16) సత్తాచాటాడు. అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా ఛేదించింది. ఆ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(68) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో కేకేఆర్ సునాయాసంగా నెగ్గింది. ఈ విజయంతో కోల్‌కతా 12 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా.. మరోవైపు, ఢిల్లీ ఈ ఓటమితో ఐదో స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయింది.

సాల్ట్ మెరుపులు

154 పరుగుల మోస్తరు లక్ష్యమే కావడంతో కేకేఆర్‌దే విజయం అంతా ముందే అనుకున్నారు. ఆ అంచనాను మరింత తేలిక చేశాడు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్. ఢిల్లీ బౌలర్లను ఊచకోతకోసి అతను ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు దంచాడు. అతని దూకుడు తొలి ఓవర్‌లోనే మొదలైంది. విలియమ్స్ వేసిన ఆ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 23 పరుగులు పిండుకున్నాడు. మూడో ఓవర్‌లో వరుసగా 6, 6 దంచాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో 18 పరుగులు రాబట్టిన అతను 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సాల్ట్ మెరుపులతో పవర్ ప్లేలో కేకేఆర్ 79/0తో నిలిచింది. పవర్ ప్లే తర్వాత ఢిల్లీ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. 6వ ఓవర్‌లో ఓపెనర్ సునీల్ నరైన్(15)‌ను అవుట్ చేసిన అక్షర్ పటేల్.. వరుస ఓవర్‌లో ఫిలిప్ సాల్ట్(68) దూకుడుకు బ్రేక్ వేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రింకు సింగ్(11) కూడా వెనుదిరిగాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ బౌలర్లు మ్యాచ్‌ మలుపు తిప్పుతారేమో అనిపించింది. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(26 నాటౌట్) మరో వికెట్ పడకుండానే లక్ష్యాన్ని పూర్తి చేశారు.

తడబడిన ఢిల్లీ

గత రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు కేకేఆర్ బౌలింగ్‌లో తడబడ్డారు. కుల్దీప్ యాదవ్(35 నాటౌట్) టాప్ స్కోరర్. అతను చేసిన విలువైన పరుగులతోనే ఢిల్లీ పోరాడే స్కోరు సాధించింది. లేదంటే ఆ జట్టు 120 పరుగుల్లోపే పరిమితమయ్యేది. కేకేఆర్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మొదటి నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. పృథ్వీ షా(13), జేక్ ఫ్రేజర్(12) ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. వరుస ఓవర్లలో పృథ్వీషాతోపాటు షాయ్ హోప్(6)ను వైభవ్ అరోరా అవుట్ చేయగా.. జేక్ ఫ్రేజర్‌ను స్టార్క్ పెవిలియన్ పంపాడు. దీంతో 37/3 స్కోరుతో ఢిల్లీ కష్టాల్లో పడింది. అనంతరం కెప్టెన్ పంత్(27) ఇన్నింగ్స్ నిర్మించేందుకు చూశాడు. అభిషేక్ పొరెల్(18), అక్షర్ పటేల్(15)తో కలిసి జట్టును నడిపించాడు. ఈ పరిస్థితుల్లో స్పిన్నర్ చక్రవర్తి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. వరుస ఓవర్లలో పంత్‌తోపాటు ట్రిస్టన్ స్టబ్స్(4)ను అవుట్ చేయడంతో ఢిల్లీని ఆదుకునే వారు కరువయ్యారు. ఈ సమయంలో 14వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ బ్యాటుతో ఆకట్టుకున్నాడు. స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన కేకేఆర్ బౌలర్లను అతను ధీటుగా ఎదుర్కొ్న్నాడు. నరైన్, చక్రవర్తి ఓవర్లలో చెరో ఫోర్ బాది అతను.. స్టార్క్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్ కొట్టడం విశేషం. ఇక, రస్సెల్ వేసిన చివరి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టడంతో ఢిల్లీ స్కోరు 150 దాటింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా రెండేసి వికెట్లతో సత్తాచాటగా.. స్టార్క్, సునీల్ నరైన్ తలో వికెట్ పడగొట్టారు.

స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 153/9(20 ఓవర్లు)

పృథ్వీ షా(సి)సాల్ట్(బి)వైభవ్ 13, జేక్ ఫ్రేజర్(సి)వెంకటేశ్(బి)స్టార్క్ 12, అభిషేక్ పొరెల్(బి)హర్షిత్ రాణా 18, షాయ్ హోప్(బి)వైభవ్ 6, పంత్(సి)శ్రేయస్ అయ్యర్(బి)చక్రవర్తి 27, అక్షర్(బి)నరైన్ 15, ట్రిస్టన్ స్టబ్స్(సి)సాల్ట్(బి)చక్రవర్తి 4, కుశాగ్రా(సి)సాల్ట్(బి)చక్రవర్తి 1, కుల్దీప్ యాదవ్ 35 నాటౌట్, రసిఖ్ సలామ్(సి)శ్రేయస్(బి)హర్షిత్ రాణా 8, విలియమ్స్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 13.

వికెట్ల పతనం : 17-1, 30-2, 37-3, 68-4, 93-5, 99-6, 101-7, 111-8, 140-9

బౌలింగ్ : స్టార్క్(3-0-43-1), వైభవ్ అరోరా(4-0-29-2), హర్షిత్ రాణా(4-0-28-2), నరైన్(4-0-24-1), చక్రవర్తి(4-0-16-3), రస్సెల్(1-0-10-0)

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 157/3(16.3 ఓవర్లు)

ఫిలిప్ సాల్ట్(బి)అక్షర్ 68, సునీల్ నరైన్(సి)జేక్ ఫ్రేజర్(బి)అక్షర్ 15, రింకు సింగ్(సి)కుల్దీప్(బి)విలియమ్స్ 11, శ్రేయస్ అయ్యర్ 33 నాటౌట్, వెంకటేశ్ అయ్యర్ 26 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4.

వికెట్ల పతనం : 79-1, 96-2, 100-3

బౌలింగ్ : విలియమ్స్(3-0-38-1), ఖలీల్ అహ్మద్(3-0-28-0), రసిఖ్ సలామ్(2.3-0-30-0), అక్షర్ పటేల్(4-0-25-2), కుల్దీప్ యాదవ్(4-0-34-0)

Next Story