గంభీర్.. మాస్టర్ మైండ్.. చాంపియన్స్ ట్రోఫీ విజయం వెనుక హెడ్ కోచ్ పాత్ర

by Harish |

టీమ్ ఇండియా సాధించింది. 12 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

గంభీర్.. మాస్టర్ మైండ్.. చాంపియన్స్ ట్రోఫీ విజయం వెనుక హెడ్ కోచ్ పాత్ర
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా సాధించింది. 12 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం చివరి వరకూ రసవత్తరంగా సాగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి చాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఇతర ఆటగాళ్ల కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కెప్టెన్ రోహిత్‌తో కలిసి గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టు విజయానికి దోహదపడ్డాయి. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా గొప్పగా రాణించలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియా టూరులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీని గంభీర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. జట్టు ఎంపిక నుంచే అతను తన వ్యూహాలను అమలు చేశాడు. జట్టు ఎంపికలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌, గంభీర్ మధ్య గొడవ జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ, గంభీర్ మొండిగా ముందుకెళ్లి ఫలితం రాబట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌తో విమర్శకుల నోరు మూయించాడు.

జైశ్వాల్ ఔట్.. వరుణ్ ఎంట్రీ

జట్టు ఎంపిక నుంచే గంభీర్ తనదైన ముద్ర వేశాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ముందుగా జట్టులో లేడు. తాత్కాలిక జట్టు నుంచి యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌ను తప్పించి వరుణ్‌ను తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో వరుణ్ సత్తాచాటాడు. ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ముందు భారత్ నాలుగు స్పిన్నర్లతోనే దుబాయ్‌కు వెళ్లాలనుకుంది. కానీ, ఇంగ్లాండ్‌పై సంచలన ప్రదర్శన నేపథ్యంలో గంభీర్.. వరుణ్‌ను వెంట తీసుకెళ్లాలని భావించాడు. ఇక, టోర్నీలో ఈ మిస్టరీ స్పిన్నర్ అద్భుతం చేశాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. తొలి రెండు మ్యాచ్‌లకు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. న్యూజిలాండ్‌తో గ్రూపు మ్యాచ్‌లో తొలిసారిగా ఆడిన అతను ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. 9 వికెట్లతో సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

ఫినిషర్‌గా రాహుల్.. 5వ స్థానంలో అక్షర్

బ్యాటింగ్ లైనప్‌లో కేఎల్ రాహుల్‌‌కు ఫినిషర్‌ రోల్‌ ఇవ్వడం మొదట విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ, చాంపియన్స్ ట్రోఫీలో అతను 6వ స్థానంలో దిగాడు. అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇస్తూ 5వ స్థానంలో పంపించారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం గంభీర్ రచించిన ఈ వ్యూహం ఫలించింది. ఆ స్థానాల్లో ఇద్దరూ రాణించడం భారత్‌కు కలిసొచ్చింది. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేసే రాహుల్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. బంగ్లాదేశ్‌పై(41 నాటౌట్), సెమీస్‌లో ఆస్ట్రేలియాపై(42 నాటౌట్), కివీస్‌తో ఫైనల్‌లో (34 నాటౌట్) అతను మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయాల్లో తన పాత్ర పోషించాడు. అక్షర్ కూడా రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

ఐదుగురు స్పిన్నర్లు

ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని భారత మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ దళంలో ఉన్నారు. దుబాయ్ పిచ్ పరిస్థితులను గంభీర్ చక్కగా అర్థం చేసుకున్నాడు. మన స్పిన్నర్లపై విశ్వాసం ఉంచాడు. ఇతర జట్లు ముగ్గురు స్పిన్నర్లనే ఆడిస్తే.. భారత్ మాత్రం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మన స్పిన్ వీరులు ప్రత్యర్థి జట్లను ఏ విధంగా బెంబేలెత్తించారో చూశాం. టోర్నీలో పేసర్లు 17 వికెట్లు తీస్తే.. స్పిన్నర్లు 26 వికెట్లు పడగొట్టారు.

షమీని నమ్మడం

2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన మహ్మద్ షమీ చాంపియన్స్ ట్రోఫీకి ముందే జట్టులో చేరాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడిన అతను పెద్దగా రాణించలేదు. దానికితోడు అతని ఫిట్‌నెస్ కూడా ఆందోళన నెలకొంది. బుమ్రా దూరమవడంతో జట్టు బౌలింగ్ బలంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, గంభీర్ షమీని నమ్మాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆకట్టుకోనప్పటికీ చాంపియన్స్ ట్రోఫీలో అవకాశం ఇచ్చాడు. బుమ్రా లోటును షమీ భర్తీ చేశాడు. తొలి గ్రూపు మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌పై 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై రెండు వికెట్లు తీశాడు. మొత్తంగా టోర్నీలో 9 వికెట్లు పడగొట్టి సంయుక్తంగా సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

Next Story