గొర్రెల కుంభకోణం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

by Disha Web Desk 2 |
గొర్రెల కుంభకోణం కేసులో మరో ఇద్దరు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గొర్రెల కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరు అధికారులను గురువారం అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఇద్దరు అధికారులు డబ్బును ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి జమ చేయించినట్టుగా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. సంచలనం సృష్టించిన గొర్రెల స్కాంలో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణయ్యలను తాజాగా అరెస్ట్ చేశారు.

ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయిన ఈ ఇద్దరు గొర్రెల కొనుగోలు కోసం నియమించిన నోడల్ అధికారులను ప్రైవేట్ వ్యక్తులు చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ క్రమంలో నోడల్ అధికారులు గొర్రెల అమ్మకందారులను కలవకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా యూనిట్లను కొనిపించినట్టు పేర్కొన్నారు. ఇక, అమ్మకందారుల వివరాలను కూడా నమోదు చెయ్యలేదని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద పని చేస్తున్న ఉద్యోగులు నమోదు చేసిన వివరాలను నిందితులు ఇద్దరు ప్రభుత్వ పోర్టల్ లో అప్ లోడ్ చేసినట్టు పేర్కొన్నారు. దాంతో 2.10 కోట్ల నగదు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి జమ అయినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.


Next Story

Most Viewed