కోల్‌కతాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం: ఇద్దరు మహిళలు మృతి

by Dishanational2 |
కోల్‌కతాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం: ఇద్దరు మహిళలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కుప్పకూలింది. దీంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 13 మందిని రక్షించారు. మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే భవనం పక్కనున్న నివాస ప్రాంతాలపై పడిందని ఈ క్రమంలోనే నిద్రిస్తున్న ఇద్దరు మరణించారని తెలుస్తోంది. పలు ఇళ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. భవనానికి అధికారిక అనుమతి లేదని వెల్లడించారు. రెస్క్యూ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ సైతం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్, ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారి టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరిపాలనలో టీఎంసీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.


Next Story

Most Viewed