ఉత్సాహంగా బడిబాట పట్టిన చిన్నారులు

by  |
ఉత్సాహంగా బడిబాట పట్టిన చిన్నారులు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభమైన తొలిరోజే 80శాతం మంది విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. మొహానికి మాస్కులు తగిలించుకొని పాఠశాలకు వచ్చారు. స్కూలు ఆవరణలో శానిటైజర్ తో‌చేతులు శుభ్రం చేసుకొని తరగతి గదుల్లోకి అడుగు పెట్టారు. ఒకప్పటి విరిగిపోయిన బెంచీల స్థానంలో రంగురంగుల కొత్త బెంచీలు చూసి విద్యార్థుల ముఖాలు వెలిగిపోయాయి. చల్లటి ఫ్యాను గాలికి హాయిగా ఫీలయ్యారు. జగనన్న విద్యా కానుక ద్వారా అందుకున్న కిట్టుతో విద్యార్థుల రూపురేఖలే మారిపోయాయి. నాడు -నేడు కింద పాఠశాలలను ఆహ్లాదకరంగా మార్చడంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఈపాటికే ఇంట్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు కావడంతో భౌతిక దూరం పాటిస్తూ పాఠశాలల్లో సందడి చేశారు.

70శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలి

ప్రైవేటు విద్యా సంస్థలు 70శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆదేశించారు. అయిదారు నెలలు స్కూల్స్ నడవలేదు. అలాంటప్పుడు పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకుమించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.


Next Story

Most Viewed