తిరుపతిలో 55 శాతం పోలింగ్​

by  |
తిరుపతిలో 55 శాతం పోలింగ్​
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్​ శనివారం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా.. పోలింగ్‌కు ఎక్కడా అంతరాయం కలగలేదు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా 55 శాతం పోలింగ్​ నమోదైంది. ఆరు నుంచి ఏడు గంటల దాకా కరోనా బాధితులు ఓటేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 45.84 శాతం, సత్యవేడులో 58.4, శ్రీకాళహస్తిలో 57 శాతం, వెంకటగిరిలో 55.88 శాతం, సూళ్లూరుపేటలో 60.11 శాతం, గూడూరులో 51.82 శాతం, సర్వేపల్లి నియోజకవర్గంలో 57.91 శాతం పోలింగ్​ నమోదైంది.

నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. పోలింగ్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలింగ్ ప్రక్రియకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ పోలింగ్ అధికారిని ప్రత్యేక గదిలో ఉంచారు. వెంటనే పారిశుద్య సిబ్బంది శానిటేషన్ చేశారు. చిట్టమూరు మండలంలోని అర‌వ‌పాళెం పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఏపీవో ఏంబేటి ర‌వి మృతి చెందారు. చాతిలో నొప్పి రావడంతో పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి అధికారులు ఆస్పత్రి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

సూళ్లూరుపేట మండంలోని నూకలపాలెంలో ఉపాధ్యాయుడిగా రవి విధులు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు మోరాయించడంతో వాకాడు, నిడిగుర్తి, పొద‌ల‌కూరు, నాయుడుపేట‌లో కొద్దిసేపు పోలింగ్​కు అంతరాయం ఏర్పడింది. వైసీపీ అభ్యర్థి డాక్టరు గురుమూర్తి ఏర్పేడు మండలంలోని మన్న సముద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డి తన కుమారుడితో వచ్చి ఓటేశారు. సర్వేపల్లిలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్​రెడ్డి, సత్యవేడులో కోనేటి ఆదమూలం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ తిరుపతిలో, సీపీఎం అభ్యర్థి యాదగిరి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరు జిల్లాలో ఓటేశారు. మే 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవుతాయి. ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసినందుకు తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

సిబ్బందికి అభినందనలు: డీజీపీ గౌతం సవాంగ్​

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్​లో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగించినందుకు డీజీపీ గౌతం సవాంగ్​ పోలింగ్, పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సరిహద్దుల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపామన్నారు. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారంతో 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. 76 లక్షల నగదు, 6,884 లీటర్ల మద్యం సీజ్, 94 వాహనాలు జప్తు చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు.

సీఈసీకి టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గల్లా జయదేవ్, కనకమేడల మాట్లాడారు. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ ఓటర్లు ఓటెయ్యడానికి వచ్చిన ఘటనల వీడియోలను ఎంపీలు అందించారు. బస్సుల్లో నకిలీ ఓటర్లను తరలించడంపై ఫిర్యాదు చేశారు.

ఉప ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు వీర్రాజు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో యదేచ్ఛగా జరిగిన అక్రమ ఓట్ల పోలింగ్​ను రద్దుచేసి తిరిగి మళ్లీ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు చరిత్రలోనే చూడని విధంగా ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టగా మారిందన్నారు. అధికార వైసీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో భారీగా దొంగ ఓట్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందన్నారు. 2 లక్షలకు పైగా దొంగ ఓట్లు వేయించిందని ఆరోపించారు. ముందుగానే వైసీపీ నాయకులు నకిలీ ఓటరు ఐడీలు తయారుచేస్తున్న విషయాన్ని బీజేపీ హెచ్చరించినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ఏజెంట్లున్న పోలింగు బూతుల్లోనే దొంగఓట్లు వేసినవారిని పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా సేవలందించినట్లు ఆరోపించారు. తక్షణమే ఉప ఎన్నికను రద్దుచేసి తిరిగి కొత్తగా నిర్వహించాలని వీర్రాజు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

నకిలీ ఓట్లపై నివేదిక కోరాం: సీఈఓ విజయానంద్​

నకిలీ ఓట్లపై ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు. చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో విజయానంద్ మాట్లాడారు. నకిలీ ఓట్లు వేసేందుకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై నివేదిక పంపాలని ఆదేశించారు.


Next Story

Most Viewed