ములుగులో ఇద్దరికి కరోనా పాజిటివ్

by  |
ములుగులో ఇద్దరికి కరోనా పాజిటివ్
X

దిశ, వరంగల్: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. చాపకింద నీరులా వైరస్ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ములుగు జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, పస్రా గ్రామాలకు చెందిన వ్యక్తులకు వ్యాధి నిర్దారణ అయినట్టు చెప్పారు. మరో 26 మందికి పరీక్షలు నిర్వహించగా వారికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని కలెక్టర్ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు సాధారణంగా ఉన్నారని, ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని తాడ్వాయి లోని క్వారంటైన్ హోమ్‌కి తరలించి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించినట్టు వివరించారు. 14 రోజుల వ్యవధిలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఏరియా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించనున్నట్టు కృష్ణ ఆదిత్య తెలిపారు. అందులో ఐసోలేషన్ వార్డుతోతోపాటు ఐసీయూ సౌకర్యం, ఫిజిషియన్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఇదేకాకుండా బాధితుల ద్వితీయ పరిచయస్తులను గుర్తించే చర్యలు చేపట్టామన్నారు. దొరికిన వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచి నిఘా పెడుతామన్నారు. ఈ నేపథ్యంలోనే పస్రా, గోవిందరావుపేట, ఏటూరునాగారం గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారి చేయించామని, పారిశుద్ధ్యం చేపట్టి, మొత్తం శానిటైజేషన్ చేసినట్టు స్పష్టం చేశారు. మూడు గ్రామాల్లో వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా సర్వే చేపడుతామన్నారు. కాబట్టి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ములుగు జిల్లాలో కరోనా కలకలం రేపడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

Tags : mulugu district, corona cases, collector krishna aditya

Next Story

Most Viewed