ఆశల పల్లకిలో ‘అరవిందుడు’

by  |
ఆశల పల్లకిలో ‘అరవిందుడు’
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో తనదైన గుర్తింపును పొందాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి ఎదురొడ్డి మరీ తాజాగా సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలో గతంలో పలు సందర్భాల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు కేజ్రీవాల్ కనబరిచిన ఆసక్తిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆప్ కార్యాలయంలో మంగళవారం వెలసిన పోస్టర్లు, కేజ్రీవాల్ ఫొటో కింద జతచేసిన క్యాప్షన్.. జాతీయ రాజకీయాలపై ఆప్ స్టాండ్‌ను మరోసారి తేటతెల్లం చేసింది. అంతేకాక కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ గురించే కాకుండా భారత్ గురించి మాట్లాడుతుండటం గమనార్హం.
అన్నాహజారేతో కలిసి అవినీతి ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి కేజ్రీవాల్ తీరును గమనిస్తే, అతడు చాలా ఆశలున్న వ్యక్తని మనకు తెలిసిపోతుంది. నిజానికి తాను కనీసం మంత్రిని కూడా అవ్వాలనుకోలేదని, తన పుస్తకం ‘స్వరాజ్’లో చెప్పుకున్నా అధికారం కోసం కేజ్రీవాల్ పడ్డ తపన అందరికీ సుపరిచితమే. 2013 ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. కొద్ది నెలల్లోనే రిజైన్ చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపబడింది. మొదటి దఫాలో ఆప్ గందరగోళ పాలనతో ప్రజలు సైతం విసుగుచెందారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోడీపై పోటీ చేయడమే కాక, ఆప్ దాదాపు 400 సీట్లలో పోటీచేసి చేతులు కాల్చుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఎటువంటి మద్దతు లేకుండా ఇన్ని స్థానాల్లో పోటీ చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోలేదనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయినా కేజ్రీ గుండె ధైర్యాన్ని కోల్పోలేదు. తప్పులను తొందరగానే సరిదిద్దుకుని 2015 ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలుపొంది, మోడీ మ్యాజిక్ ప్రతిసారి పనిచేయదని నిరూపించాడు.
ఇక తన రెండో ఇన్నింగ్స్‌లో ప్రభుత్వ అధికారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకెళ్లి అనుకూల తీర్పును పొందారు. కానీ, క్రమంగా తన విశ్వసనీయతను కోల్పోవడంతో 2017 మున్సిపల్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఢిల్లీ పాలనను వదిలేసి కేజ్రీవాల్ గోవా, పంజాబ్‌ల వైపు చూస్తున్నారని ఢిల్లీ ప్రజలు భావించడమే ఇందుకు కారణం. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు పార్టీని విస్తరించాలన్న ఆప్ ఆకాంక్షలకు వరుస ఓటములు గండికొట్టాయి. అదీగాక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ‘సున్నా’ స్థానాలకు పరిమితం కావడంతోనే ‘ఆప్’లో అసలైన మార్పు మొదలైంది. క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యలపై దృష్టిసారించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగటంతో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ మోడీని విమర్శించటం ఆపేశారు. 2020 ఎన్నికల్లో, కేజ్రీవాల్ అభివృద్ధి మంత్రంతోనే మోడీని ఎదుర్కొని ప్రజావ్యతిరేకత నుంచి బయటపడ్డారు.
ఈ విజయం జాతీయ రాజకీయాలకు పునాది అంటూ కేజ్రీవాల్ అప్పుడే మాట్లాడుతున్నారు. కానీ, తన కల సాకారానికి మొదట బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మాయావతి, అఖిలేష్ యాదవ్‌లతోపాటు ప్రధానమంత్రి అభ్యర్థులుగా చాలామంది ఆశావహులు పోటీలో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ‘ఆప్’తో ఎన్ని సత్సంబంధాలున్నా కేజ్రీవాల్ నాయకత్వాన్ని మమతా బెనర్జీ అంగీకరిస్తుందా? బీఎస్‌పీ, ఎస్‌పీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), డీఎంకే, ఎన్సీపీ, ఇతర పార్టీల కూటమి అంగీకరించినా కాంగ్రెస్ అంగీకరిస్తుందా ? అనేది ప్రశ్న. హ్యాట్రిక్ విజయాలు ఆ దిశగా అడుగులు వేసేందుకు సహకరించినా.. ఇతర ప్రతిపక్ష నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడం మాత్రం కేజ్రీవాల్‌కు అంత సులభం కాదు.
వయసు దృష్ట్యా కేజ్రీవాల్‌కు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్నందున, సరైన సమయం కోసం వేచిచూస్తూ ఒక్కో అడుగు ముందుకు సాగాలి. ఢిల్లీలో తన స్థానాన్ని పదిలపరుచుకున్న తర్వాతే, ఇతర రాష్ట్రాల్లో ఆప్ విస్తరణ గురించి ఆలోచించాలి. కానీ అలా చేస్తే కేజ్రీవాల్ ఎందుకవుతాడు ? తొందరలోనే తన కలను నెరవేర్చుకునే ప్రయత్నాలు మొదలెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.


Next Story

Most Viewed