పట్నం చేరిన గద్వాల నేతల పంచాయితీ.. అధిష్టానం ఏ తీర్పు ఇవ్వనుంది..?

by  |
mahabub nagar news
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా అధికార పార్టీ నేతల పంచాయితీ అధిష్టానానికి చేరింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మధ్య విభేదాలు ఇటీవల పతాక స్థాయికి చేరుకున్న విషయం విదితమే. గత నాలుగు రోజుల క్రితం జెడ్పి చైర్ పర్సన్ భర్త తిరుపతయ్య సస్పెన్షన్ కు గురైన సిఐతో ఓ హత్య కేసుకు సంబంధించి మాట్లాడే క్రమంలో మరో ఎస్ఐ ఈ వ్యవహారంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే తొత్తుగా ఉంటున్నారంటూ తిరుపతయ్య మాట్లాడిన ఆ ఆడియో లీక్ కావడం రాజకీయంగా దుమారం రేపింది.

ఒక సామాజిక వర్గం వారు తిరుపతయ్య పై కేసు పెట్టారు. మరోవైపు ఒక హత్యకు సంబంధించిన వ్యవహారం పై మృతుని కుటుంబీకులు ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. ఇలా రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న అధికార పార్టీ నడిగడ్డ నేతల వ్యవహారాలు అధిష్టానం దృష్టికి చేరాయి. బుధవారం ఉదయం జడ్పీ చైర్ పర్సన్ దంపతులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారని ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. కానీ గద్వాల జిల్లాలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, అక్రమ వ్యాపారాలు, తమపై ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రికి వివరించినట్లు సమాచారం. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని సరితా తిరుపతయ్య దంపతులు మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేయడంతో పెన్షన్ పై ఎమ్మెల్యేలతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Next Story

Most Viewed