వైసీపీ ఖాతాలో నాలుగు రాజ్యసభ స్థానాలు

by  |
వైసీపీ ఖాతాలో నాలుగు రాజ్యసభ స్థానాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించింది. అంతా ఊహించినట్టే నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ తరఫున బరిలో నిలిచిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమిళ్ నత్వానిలు విజయం సాధించారు. టీడీపీ ఏకైక అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం 175. ఒక్క రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి 38 ఓట్లు అవసరం. వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి 23, ప్రజారాజ్యం పార్టీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. అయితే, సంఖ్యా బలం లేకున్నా టీడీపీ అభ్యర్థిని నిలిపింది.

చెల్లని ఓట్లు టీడీపీవే..

అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఇద్దరు అభ్యర్థులు ఓటు వేయకపోవడంతో మొత్తం 173 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు చేపట్టగా నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇవన్నీ టీడీపీకే చెందినవి కావడం గమనార్హం. మిగిలిన 169 ఓట్లలో వైసీపీ అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమిళ్ నత్వానిలకు 38 చొప్పున ఓట్లు పోలు కాగా, టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు పడ్డాయి. దీంతో వైసీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ఎన్నిక అధికారి ప్రకటించారు.

టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. వారిని ఇరుకున పెట్టడం కోసం ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓటు వేసినా ఎవరికి వేశారో ఏజెంట్‌కు చూపాల్సిన అనివార్య పరిస్థితి. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకే ఓటు వేసినా మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్‌కు బదులుగా 1 అని పెట్టారు. దీంతో ఎన్నికల అధికారి ఆ ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా ఇదే తప్పుచేశారు. ఆమె కూడా టిక్ మార్క్‌కు బదులుగా 1 అని రాయడంతో భవాని ఓటు కూడా చెల్లలేదు. అయితే, పోలింగ్‌ సందర్భంగా ఒక ఎమ్మెల్యే బ్యాలెట్‌ పేపర్‌పై ‘గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకు ఇచ్చేది?’ అంటూ రాశారు. ఇది రాసిందెవరా? అని రెండు పార్టీల నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

ఆత్మప్రబోధానుసారం వేశాను: రాపాక

మరోవైపు జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానని ప్రకటించారు. అయితే ఆయన వైఎస్సార్సీపీకే ఓటు వేసినట్టు తెలుస్తోంది. దీంతో అంతా ఊహించనట్టే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.

Next Story

Most Viewed