మీ అక్కగా కోరుతున్నా.. ఆత్మహత్యలొద్దు

by  |
మీ అక్కగా కోరుతున్నా.. ఆత్మహత్యలొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: “నిరుద్యోగులెవరూ అధైర్య పడొద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటివారితోనైనా పోరాటం చేద్దాం. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే.. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్ కోసం నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం అందరం కలిసి పోరాడుదాం” అని షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగ యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారని, అలాంటిది తెలంగాణ వచ్చింది, కేసీఆర్ కు అధికారం వచ్చింది, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం రాలేదని విమర్శలు చేశారు.

“కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమోనని శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు” అని ట్వీట్ చేశారు. ఇంతకన్నా టీఆర్ఎస్ కు అవమానం ఉండదని షర్మిల పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్, చందమామల్లాంటి పిల్లలు చనిపోతున్నారని మొసలి కన్నీరు కార్చారని, ఇలా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు. వందల్లో నిరుద్యోగ యువత బలిదానాలు చేసుకుంటున్నా మీరు కానీ, మీ మంత్రులు కానీ కనీసం భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story