అధీర్ రంజన్‌ను మందలించిన ఒక రోజు తర్వాత బెంగాల్‌లో ఖర్గే పోస్టర్లపై సిరా

by Harish |
అధీర్ రంజన్‌ను మందలించిన ఒక రోజు తర్వాత బెంగాల్‌లో ఖర్గే పోస్టర్లపై సిరా
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి కారణంగా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇటీవల ఇండియా కూటమికి బయటి నుంచి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించడంతో పాటు బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరిని తప్పుబట్టిన ఒక రోజు తరువాత, ఆదివారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముందు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నటువంటి అనేక పోస్టర్లు, హోర్డింగ్‌లపై నల్ల ఇంకుతో 'తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్' అని ఖర్గేకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు రాశారు.

ఈ పని అధీర్ రంజన్ చౌదరి మద్దతు దారులు చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే తన స్వస్థలమైన బహరంపూర్‌లో ఉన్న చౌదరి ఈ సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలను కోరగా, కేసు నమోదైందని ఖర్గేకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్‌లను కూడా తొలగించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, అధిర్ రంజన్ చౌదరి మధ్య విభేదాలు సృష్టించాలని టీఎంసీ ఈ విధంగా చేసిందని పార్టీ నాయకుడు ఒకరు ఆరోపించారు.

బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి ఈ మధ్య కాలంలో మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బెంగాల్‌లో నన్ను, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అంతం చేయాలని ఆమె చూస్తున్నారు. అలాంటి వ్యక్తికి నేను అనుకూలంగా మాట్లాడలేనని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన మల్లికార్జున్ ఖర్గే శనివారం చౌదరిని తప్పుబట్టారు. దీంతో ఆయనకు నిరసనగా బెంగాల్‌లో పోస్టర్లపై నల్ల సిరాను చల్లడం గమనార్హం.

Next Story