రికార్డు స్థాయిలో ఎనిమిదేళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

by  |
రికార్డు స్థాయిలో ఎనిమిదేళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, మెటల్ ధరలు భారీగా పెరగడంతో భారత్‌లో వరుసగా మూడవ నెల టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఎనిమిదేళ్ల గరిష్ఠానికి పెరిగింది. మార్చి నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం 7.39 శాతానికి చేరుకున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.17 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 2012 అక్టోబర్‌లో నమోదైన 7.4 శాతం తర్వాత టోకు ద్రవ్యోల్బణం మార్చిలో అత్యధికంగా నమోదైంది. టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం గతేడాది మార్చిలో 0.42 శాతంగా నమోదైంది. ‘ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, మెటల్ ధరలు గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరగడంతో ఎనిమిదేళ్ల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ టోకు ద్రవ్యోల్బణ పెరిగిందని’ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అధికారిక గణాంకాల ప్రకారం… మార్చి నెలకు సంబంధించి పండ్లు, పప్పు ధాన్యాల ధరలు పెరగడం వల్ల ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 3.24 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 5.19 శాతం క్షీణించాయి. ఫిబ్రవరిలో నమోదైన కూరగాయల ధరలు 2.90 శాతం కంటే మార్చిలో మరింత తగ్గడం గమనార్హం. పప్పు ధాన్యాల టోకు ద్రవ్యోల్బణం 13.14 శాతం, పండ్ల ద్రవ్యోల్బణం 16.33 శాతం, ఇంధన టోకు ద్రవ్యోల్బణం 10.25 శాతం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం 0.58 శాతంగా నమోదయ్యాయి. తయారీ ఉత్పత్తుల ధరలు 7.34 శాతం పెరిగాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో బొగ్గు ధరలు తగ్గాయి. బంగాళదుంపల ధరలు 33 శాతానికిపైగా తగ్గాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి కంటే అధికంగా నమోదైంది.


Next Story

Most Viewed