ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌పై ట్రాఫిక‌ర్స్ క‌న్ను.. అమ్మాయిల్ని ప‌ట్టుకెళ్లి..?!

by Disha Web Desk 20 |
ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌పై ట్రాఫిక‌ర్స్ క‌న్ను.. అమ్మాయిల్ని ప‌ట్టుకెళ్లి..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంలో ఏ సిద్ధాంతమైనా క‌ష్టంలో ఉన్న‌వారిని ఆదుకోవాల‌నే చెబుతుంది. అయితే, అత్యాధునిక నాగ‌రిక‌త‌లో క‌థ మారింది. క‌ష్టంలో ఉన్న మ‌నిషి ఇప్పుడు మార‌క‌ వ‌స్తువుగా మారిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక‌ప్పుడున్న బానిస‌త్వపు అమాన‌వీయ‌త‌ కాద‌ది, మ‌నిషి దీనస్థితిని స్వార్థ ప్ర‌యోజ‌నంగా మార్చుకుంటున్న వైనం. ఇదే, తాజాగా ఉక్రెయిన్ యుద్ద శ‌ర‌ణార్థుల ప‌ట్ల జ‌రుగుతోంది. ఉక్రెయిన్ నుండి ఇత‌ర దేశాల‌కు శ‌ర‌ణార్థులుగా వెళుతున్న వారిని ఆశ్రయం ఇస్తామని చెప్పి వంచిస్తున్న సంఘ‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి.

ఇలాంటివి ఎన్నో..

ఇటీవ‌ల ఉక్రెయిన్ నుంచి పోలాండ్ చేరుకున్న‌ 19 ఏళ్ల శరణార్థిపై ఓ వ్య‌క్తి అత్యాచారం చేశాడనే అనుమానంతో పోలాండ్ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో కేసులో 16 ఏళ్ల బాలిక‌కు పని ఇప్పిస్తామ‌ని, ఉండ‌టానికి ఇల్లు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి తీసుకెళ్తున్న క్ర‌మంలో పోలీసులు జోక్యం చేసుకోగా అగంత‌కులు జారుకున్నారు. మ‌రో సంద‌ర్భంలో, పోలాండ్‌లోని మెడికా సరిహద్దులో ఉన్న శరణార్థి శిబిరంలో ఒక వ్యక్తి మహిళల‌కి, పిల్లల‌కి మాత్రమే సహాయం చేస్తాన‌ని ముందుకు రావ‌డం అనుమానాస్ప‌దంగా క‌నిపించి, పోలీసులు ప్రశ్నించగా ప్లేటు మార్చాడు మాయ‌గాడు... ఇలా ఇప్పుడు ఎన్నో క‌ర్క‌శ కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

నిఘా నేత్రం

ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌లు, యువ‌తులు, పిల్ల‌లు శ‌ర‌ణార్థులుగా ఆశ్ర‌యం కోసం ఎదురుచూస్తుంటే, ట్రాఫిక‌ర్లు ఆడ‌వాళ్లే ల‌క్ష్యంగా మాన‌వ అక్ర‌మ‌ర‌వాణాకు తెగ‌బ‌డుతున్నారు. ఈ దోపిడీని నిరోధించి, శ‌ర‌ణార్థుల‌ను ర‌క్షించాల‌నే డిమాండ్ల‌తో అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న కొన‌సాగుతోంది. దీనిపై ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ఐక్య‌రాజ్య స‌మితి శ‌ర‌ణార్థుల ఏజెన్సీ UNHCR ప్ర‌తినిధులు రోమానియా, పోలాండ్‌, మోల్డోవా, స్లోవేకియా స‌రిహ‌ద్దుల‌ను సంద‌ర్శించి సంర‌క్ష‌ణా చ‌ర్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్నారు.

అక్ర‌మ ర‌వాణా

ఇప్ప‌టికే ఉక్రెయిన్ నుండి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు, 2.5 మిలియన్ల మంది ప్రజలు దేశం విడిచి శ‌ర‌ణార్థులుగా ఇత‌ర దేశాల‌కు పారిపోయారు. శ‌ర‌ణార్థుల‌ను ఆదుకునేందుకు వివిధ దేశాల్లో వాలంటీర్లు ప‌నిచేస్తున్నారు. బాధితుల‌కు ఆశ్ర‌యం, ప‌ని క‌ల్పించ‌డం వంటి స‌హాయం చేస్తుంటే, మ‌రోవైపు వీరిని టార్గెట్ చేసిన ట్రాఫిక‌ర్లు మాన‌వ అక్ర‌మర‌వాణాలో భాగంగా లైగింక దోపిడి, న‌గ‌దు దోపిడి, ఇళ్ల‌ల్లో, ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నివారిగా, బానిస‌లుగా మార్చ‌డం, మ‌నుషుల అవ‌య‌వాల‌ను తొల‌గించి, అమ్మ‌డం, పిల్ల‌ల్ని ఎత్తుకెళ్లి నేర‌స్థులుగా మార్చ‌డం వంటి ర‌క‌ర‌కాల దోపిడీల‌కు పాల్ప‌డుతున్నారు. అంతేకాక‌, అమ్మాయిలే టార్గెట్‌గా కొంద‌రు అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లూ చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో బెర్లిన్‌ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఆశ్ర‌యం ఇస్తాన‌నే ఆఫర్‌లను అంగీకరించొద్ద‌ని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఉంటే స‌మాచారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇక‌, రొమేనియా, పోలాండ్ దేశాల స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే మ‌ఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు నేరస్థుల కోసం వెతుకుతున్న‌ట్లు తెలిపారు. రొమేనియా సరిహద్దు న‌గ‌రం సిరెట్‌లో, మహిళలకు ఉచిత రైడ్‌లు ఆఫ‌ర్ చేస్తున్న ముఠాల‌ను క‌ట్ట‌డి చేశారు.

వీళ్లే ల‌క్ష్యంగా..

ముఖ్యంగా కుటుంబాలు, స్నేహితులు, ఇతరత్రా కనెక్షన్‌లు లేని వారినే ల‌క్ష్యంగా ట్రాఫిక‌ర్లు ప‌నిచేస్తున్నట్లు భ‌ద్ర‌తా సిబ్బంది తెలియ‌జేస్తున్నారు. సరిహద్దు దేశాలకు వచ్చే శరణార్థులలో అధిక శాతం మంది ఐరోపాలోని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల‌ వద్దకు వెళ్తుండ‌గా, చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అపరిచితులపై ఆధారపడుతున్నార‌నీ, ఇక‌, ప‌క్క దేశాల్లో ఎలాంటి ప‌రిచ‌యం లేని వాళ్లు మోస‌గాళ్ల చేతికి సులువుగా చిక్కుతున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. యుద్ధ భూమి నుంచి సొంత ఇళ్ల‌ను, ఆస్తిని విడిచిపెట్టి వ‌స్తున్న వారు మానసిక ఒత్తిడి, భయం, గందరగోళానికి గురవుతున్నారని, ఈ ప‌రిస్థితిని మోస‌గాళ్లు వినియోగించుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే, ఏలాంటి స‌హాయ‌మైన అధికారుల స‌మ‌క్షంలోనే పొందాల‌ని పోలీసులు తెలియ‌జేస్తున్నారు. స‌హాయం చేస్తామ‌ని ముందుకొస్తున్న వంద మందిలో ఒక్క‌డు మోస‌గాడైనా అది ఇబ్బందిగా ప‌రిణ‌మిస్తున్న క్ర‌మంలో అధికారులు అంద‌రిపైనా దృష్టిపెట్టాల్సి వ‌స్తోంది.

ఆప‌న్న‌హ‌స్తం

ఈ క్ర‌మంలో యునైటెడ్ ఫర్ ఉక్రెయిన్ అనే ఫేస్‌బుక్ గ్రూప్‌ను ప్రారంభించిన యూరోపియన్ పార్లమెంట్‌లోని రొమేనియన్ సభ్యుడు వ్లాడ్ ఘోర్గే, శరణార్థుల కోసం వసతి సహాయం చేస్తున్నారు. ఈ గ్రూప్‌లో 2,50,000 కంటే ఎక్కువ మంది సభ్యులుండ‌టం విశేషం. ఈ గ్రూప్ ద్వారా ఆశ్ర‌యం ఇస్తామ‌ని ముందుకొచ్చే ప్ర‌తి వ్య‌క్తి స‌మాచారాన్ని ప‌రిశీలించి మ‌రీ అనుమ‌తి ఇస్తున్నారు. ఇక‌, పోలాండ్‌లోని మెడికా సరిహద్దులో ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్‌లోని ఏడుగురు మాజీ సభ్యులు, ఒక ఆర్మీ గ్రూప్ క‌లిసి శరణార్థులకు స్వచ్ఛందంగా భద్రతను కల్పిస్తున్నారు.


Next Story

Most Viewed