సీరియల్ కిల్లర్ రక్తనాళం దొరక్క.. మరణశిక్ష నిలిపివేత!

by Disha Web Desk 14 |
సీరియల్ కిల్లర్ రక్తనాళం దొరక్క.. మరణశిక్ష నిలిపివేత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రక్తనాళం దొరక్కపోవడంతో మరణశిక్ష నిలిచిపోయిన విచిత్ర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చేందుకు వైద్యలు అనేక సార్లు ప్రయత్నించారు. కానీ ఖైదీ రక్తనాళం మాత్రం కనుక్కోలేక తిప్పలుపడ్డారు. దీంతో చేసేదేమీ లేక మరణశిక్షను నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన సీరియల్‌ కిల్లర్‌ థామస్‌ యూజీన్‌ క్రీచ్‌ (73) దాదాపు అర్ధశతాబ్దిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దాదాపు ఐదు హత్యలకు పాల్పడ్డాడు. అనేక కేసుల్లో సైతం అనుమానితుడిగా ఉన్నాడు.

గత కొంతకాలంగా మరణశిక్ష ఎదుర్కొంటున్న థామస్‌కు శిక్ష పూర్తి చేసేందుకు ఇటీవల అధికారులు సిద్ధమయ్యారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చి మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే ఇందుకోసం ముగ్గురు వైద్య సిబ్బంది కిల్లర్ చేతులు, కాళ్లు ఇతర ప్రాంతాల్లో రక్తనాళం కోసం వెతికారు. ఇలా గంటపాటు వెతికినప్పటికీ సరైన రక్తనాళం లభించలేదు. దీంతో మరణ శిక్ష అమలును విరమించుకున్నారు. ఇదే సమయంలో దోషి తరఫు న్యాయవాది స్థానిక కోర్టును ఆశ్రయించారు. మరణశిక్షను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని కోర్టుకు తెలిపారు. తాజాగా విచారించిన న్యాయస్థానం ప్రస్తుత డెత్‌ వారెంట్‌ ముగిసే వరకు అతని మరణశిక్ష అమలుకు ప్రయత్నించొద్దని ఆదేశాలిచ్చింది. దీంతో కొత్తగా మరో డెత్ వారెంట్‌ వచ్చే వరకు అధికారులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.


Next Story

Most Viewed