పాకిస్తాన్‌‌‌లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు

by Disha Web Desk 17 |
పాకిస్తాన్‌‌‌లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం కీలక ప్రకటన చేశారు. త్వరలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్తాన్‌ను సందర్శిస్తారని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి, రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇజ్రాయెల్‌ సిరియాలోని రాయబార కార్యాలయంపై దాడి చేసిన తరువాత ప్రతీకార చర్యగా ఇరాన్ ఇటీవల 300కు పైగా డ్రోన్లు, క్షీపణులతో ఇజ్రయెల్‌పై దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి పెద్ద నష్టం సంభవించలేదు. ఇరాన్‌ కూడా యుద్ధం ముగిసిందని ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్‌‌పై దాడికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం పాకిస్తాన్‌‌కు వెళ్లనుండటం గమనార్హం.

బుధవారం పాక్ కేబినెట్ సమావేశం అనంతరం షరీఫ్ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ వారం వచ్చిన సమాచారం ప్రకారం, బ్రాడ్‌కాస్టర్ జియో న్యూస్ మూలాలను ఉటంకిస్తూ ఇరాన్ అధ్యక్షుడు ఏప్రిల్ 22న పాకిస్తాన్‌కు వస్తారని చెప్పారు. అయితే దీనిపై పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయాన్ని వివరణ కోరగా అది స్పందించలేదు. కానీ ఇరాన్ అధ్యక్షుడి రాకని ప్రధాని కార్యాలయం తాజాగా ప్రకటించింది. అలాగే, సౌదీ అరేబియా బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టనుందని సమావేశం అనంతరం అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed