జపాన్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. జీ7 సదస్సు, క్వాడ్ దేశాల నేతలతో భేటీ

by Disha Web Desk 17 |
జపాన్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. జీ7 సదస్సు, క్వాడ్ దేశాల నేతలతో భేటీ
X

హిరోషిమా (జపాన్): జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్ లోని హిరోషిమా సిటీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి జపాన్, భారత సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. మే 21 వరకు ప్రధాని మోడీ హిరోషిమాలోనే ఉండి .. జీ7 సదస్సులో భాగంగా నిర్వహించే వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. హిరోషిమా సిటీలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

ప్రస్తుతం జీ 20 దేశాల కూటమికి ఇండియా నేతృత్వం వహిస్తోంది. ఈ నేపథ్యంలో గెస్ట్ కంట్రీ హోదాలో భారత్ ను జీ7 కూటమి ప్రత్యేకంగా ఆహ్వానించింది. "ఈ సంవత్సరం జీ20 కి భారతదేశం నేతృత్వం వహిస్తున్న తరుణంలో జీ7 సదస్సులో నేను పాల్గొంటుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది. జీ7 సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక భేటీలు కూడా జరుగుతాయి" అని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

మరోవైపు ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా మే 22 నుంచి 24 వరకు జరగాల్సిన క్వాడ్ దేశాల సదస్సు రద్దయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాలేనని చెప్పడంతో.. క్వాడ్ సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అలబనీస్ ప్రకటించారు.

దీంతో క్వాడ్ సభ్య దేశాలైన ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా అధినేతలు.. జీ7 సదస్సు వేదికగా ఉన్న హిరోషిమా సిటీలోనే భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ప్రధాని మోడీ యథాతథంగా (మే 22 నుంచి 24 వరకు) ఆస్ట్రేలియాలో మూడు రోజులు పర్యటించనున్నారు.


Next Story

Most Viewed