ఫ్రాన్స్ ప్రధానిగా గే.. గాబ్రియేల్ అట్టల్‌!

by Dishanational4 |
ఫ్రాన్స్ ప్రధానిగా గే..  గాబ్రియేల్ అట్టల్‌!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రి పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ పేరును మంగళవారం ప్రతిపాదించారు. దీంతో ప్రధాని పదవిని గాబ్రియేల్ అట్టల్‌‌ చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే అధికారిక లాంఛనాలతో ఆయన ప్రధాని పోస్టును చేపడతారు. ఇంత పిన్న వయస్కుడు ఫ్రాన్స్ ప్రధాని కానుండటం ఇదే తొలిసారి. ప్రధాని కాబోతున్న అట్టల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్ల క్రితం ఆయన ఫ్రాన్స్ ఆరోగ్య శాఖలో సలహాదారుగా పనిచేశారు. సోషలిస్టు పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండేవారు. ప్రధాని కావడానికి ముందు వరకు మాక్రాన్ సర్కారులో విద్యాశాఖ మంత్రిగా గాబ్రియేల్ అట్టల్ పనిచేశారు. ఇక ఇంతకుముందు వరకు దేశ ప్రధానిగా వ్యవహరించిన ఎలిజబెత్ బోర్న్(62) సోమవారం రోజే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు రాజీనామా సమర్పించారు. ఈ ఏడాది జూన్‌లో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి కూడా ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో మాక్రాన్ ఉన్నారు. ఈక్రమంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కొత్త మంత్రివర్గం కూర్పుతో బదులివ్వాలని ఆయన భావిస్తున్నారు.

Next Story

Most Viewed