వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్: విదేశాంగ మంత్రి

by Dishanational4 |
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్: విదేశాంగ మంత్రి
X

రియాద్: ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చుకుని అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేశంగా ఎదగడానికి భారత్ శక్తివంతంగా ప్రయత్నాలు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. 3 రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియాకు విచ్చేసిన మంత్రి రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాల గురించి సౌదీ ప్రభుత్వంతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా సౌదీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం విసిరిన సవాళ్లను తట్టుకుని 2023లో 7 శాతం వృద్ది రేటును భారత్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సౌదీరాజధాని రియాద్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన జైశంకర్ జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో సౌదీలోని భారతీయులు చేస్తున్న దోహదాన్ని కొనియాడారు. ప్రత్యేకించి కోవిడ్-19 కాలంలో దేశం చూపించిన నిబ్బరాన్ని వివరించారు. భారత్‌లో ఇప్పుడు జాతీయ పరివర్తన జరుగుతోందని చెప్పారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో చమురు, ఆహారధరల పెరుగుదల, షిప్పింగ్ చార్జీల పెంపు వంటి పలు సవాళ్లను దేశం ఎదుర్కొని తట్టుకుందని, ఈ సంవత్సరం ప్రపంచంలోనే వేగవంతంగా ఎదుగుతున్న దేశంగా భారత్ ఆవిర్భవించగలదని మంత్రి పేర్కొన్నారు.



Next Story