లాలూ ప్రసాద్ గోద్రా రైలు దహనం కేసులో దోషులను కాపాడాలని చూశారు: మోడీ

by Disha Web Desk 17 |
లాలూ ప్రసాద్ గోద్రా రైలు దహనం కేసులో దోషులను కాపాడాలని చూశారు: మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గోద్రా రైలు దహనం కేసులో నిందితులను రక్షించడానికి ప్రయత్నించారని ప్రధాని మోడీ అన్నారు. బీహార్‌లోని దర్భంగాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన, సోనియా గాంధీ హయాంలో 60 మందికి పైగా కరసేవకుల మరణానికి కారణమైన వారిని కాపాడటానికి కాంగ్రెస్‌తో కలిసి ఆర్జేడీ అధ్యక్షుడు కీలకంగా వ్యవహరించారని, ప్రతిపక్ష పార్టీల ‘బుజ్జగింపు రాజకీయాలు’ దీనికి కారణమని అన్నారు.

ఘటన సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్, విచారణ కమిటీని ఏర్పాటు చేసి, నేరానికి పాల్పడిన వారిని నిర్దోషులుగా నివేదికను రూపొందించి, కరసేవకుల మీదనే నిందలు వేయడానికి ప్రయత్నించారని మోడీ ఆరోపించారు. 2007లో లాలూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని వాదించారు. ఆర్‌జేడీ అధిష్టానం-కాంగ్రెస్ ఎస్సీలు, ఎస్టీలు, OBCల కోటాలను దారి మళ్లించాలని కోరుకుంటున్నాయని ఎన్నికల ప్రచారంలో మోడీ అన్నారు.

ఇండియా కూటమి ముస్లింలకు రిజర్వేషన్లను మళ్లించడానికి ప్రయత్నిస్తోంది. వారు బాబాసాహెబ్ అంబేద్కర్, నెహ్రూ మత ప్రాతిపదికన రిజర్వేషన్‌లను వ్యతిరేకించారు, కానీ వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఈ కూటమి ఉందని పేర్కొన్నారు. నేను ఆరాధించే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాని వారు నాపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మోడీ తెలిపారు.

అగ్నిపథ్ పథకం గురించి చర్చిస్తున్నప్పుడు తేజస్వి యాదవ్ హిందూ ముస్లిం కథనాన్ని ప్రస్తావనకు తెచ్చారని ప్రధాని విమర్శించారు. దేశానికి చీకటి రోజులు వచ్చినప్పుడు, బీహార్ చాలా ఘోరంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని లాంతరు యుగానికి తిరిగి రానివ్వకూడదని ఆర్జేడీ ఎన్నికల గుర్తును ప్రస్తావిస్తూ ప్రధాని అన్నారు. అలాగే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలన ట్రాక్ రికార్డ్‌ను కూడా ప్రశంసించారు.

Next Story

Most Viewed