త‌ప్పుడు లెక్క‌లో ఇండియా టాప్‌! ఈ వ్యాధి వ‌ల్ల రెండేళ్ల‌లో 18.2 మిలియ‌న్ల జ‌నం చచ్చిపోయారు!!

by Disha Web Desk 20 |
త‌ప్పుడు లెక్క‌లో ఇండియా టాప్‌! ఈ వ్యాధి వ‌ల్ల రెండేళ్ల‌లో 18.2 మిలియ‌న్ల జ‌నం చచ్చిపోయారు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః తాజాగా 'ది లాన్సెట్‌'లో ప్రచురించిన ఓ విశ్లేషణ విస్తుగొలిపే నిజాలు బ‌య‌ట‌పెట్టింది. కోవిడ్-19 మహమ్మారి వ‌ల్ల‌ మరణించిన వారి సంఖ్య అధికారిక రికార్డుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చ‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది. జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య కోవిడ్-19 మరణాల సంఖ్య 5.9 మిలియన్లుగా అధికారిక లెక్క‌లు చెబుతుంటే అస‌లు క‌థ వేరుగా ఉంది. ఈ కాలంలో 18.2 మిలియన్ల అద‌న‌పు మరణాలు సంభవించాయని కొత్త అధ్యయనం అంచనా వేసింది. మరణాలకు సంబంధించిన కార‌ణాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని, దీన్ని రూపొందించారు.

వీటి ఆధారంగా...

ఈ మ‌ర‌ణాల‌ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేశారు. అందుబాటులో ఉన్న స‌మాచారం ప్రకారం దీనికి సంబంధించిన‌ చాలా అధ్యయనాలు ఆయా భౌగోళిక ప్ర‌దేశాల్లోనే జ‌రిగాయి. వీటి ఆధారంగా అధ్య‌య‌నం నిర్వ‌హించారు. 191 దేశాలు, వాటిలో 252 ఉప‌-భూభాగాల‌ డేటాను ప‌రిశీలించి ఈ విశ్లేష‌ణ చేసారు. 'వరల్డ్ మోర్టాలిటీ డేటాబేస్', 'హ్యూమన్ మోర్టాలిటీ డేటాబేస్', 'యూరోపియన్ స్టాటిస్టికల్ ఆఫీస్' వంటి ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుండి కూడా స‌మాచారం సేక‌రించారు.

అదనపు మరణాలకు కార‌ణాలు...

కోవిడ్ -19 వల్ల నేరుగా సంభవించే మరణాలు, మహమ్మారి ప్ర‌భావంతో క‌లిగిన పరోక్ష మరణాల మధ్య తేడాను గుర్తించడం చాలా కీలకమని రచయితలు తెలిపారు. మహమ్మారి సమయంలో ప్రవర్తనలో వ‌చ్చే మార్పులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర ముఖ్యమైన సేవ‌లు అందుబాటులో లేకపోవడం మరణాలకు పరోక్షంగా కారణమని అధ్యయనం తెలిపింది.

ఈ దేశాల్లోనే అధికం!

తాజా అధ్యయనం ప్రకారం, అధిక మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా ల‌క్ష మంది జనాభాకు 120 మరణాలుగా అంచనా వేయ‌గా.. 21 దేశాలలో ల‌క్ష జ‌నాభాకు 300 కంటే ఎక్కువ మరణాల రేటు ఉన్నట్లు అంచనా వేశారు. అండియన్ లాటిన్ అమెరికా, తూర్పు ఐరోపా, మధ్య యూరప్, దక్షిణ స‌బ్‌-సహారా ఆఫ్రికా, మధ్య లాటిన్ అమెరికాలో అత్యధికంగా మరణాల రేట్లు ఉన్నాయి. లెబనాన్, అర్మేనియా, ట్యునీషియా, లిబియా, ఇటలీలోని అనేక ప్రాంతాలు, దక్షిణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అనేక రాష్ట్రాలతో సహా వివిధ‌ ప్రదేశాల్లో అధిక మ‌ర‌ణాల‌ రేట్లు న‌మోద‌య్యాయి.

అత్యధిక మరణాలు నమోదయ్యింది...

కోవిడ్-19 వ‌ల్ల న‌మోదైన మ‌ర‌ణాలు (5.3 మిలియన్లు) దక్షిణాసియాలో అత్యధికంగా ఉన్న‌ట్లు స్ట‌డీ అంచనా వేసింది. దాని తర్వాత ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో 1.7 మిలియన్ల మరణాలు, తూర్పు ఐరోపాలో 1.4 మిలియన్ల అదనపు మరణాలు సంభవించాయి. ఇక‌, ఒక దేశ స్థాయిలో అత్యధిక మరణాలు భారతదేశంలోనే సంభవించిన‌ట్లు అధ్య‌య‌నం పేర్కొంది. భారతదేశంలో 4.1 మిలియన్లకు పైగా మరణించిన‌ట్లు అధ్య‌య‌నం వెల్ల‌డించింది. 24 నెలల కాలంలో ప్రపంచ క‌రోనా మరణాలలో సగానికి పైగా ఇండియా, యూఎస్ఏ, రష్యా, మెక్సికో, బ్రెజిల్, ఇండోనేషియా, పాకిస్తాన్‌ దేశాల నుంచే ఉన్న‌ట్లు అధ్యయనంలో గుర్తించారు. ప్రపంచ మొత్తం మరణాల్లో భారతదేశం మాత్రమే 22% గా ఉన్న‌ట్లు అంచ‌నా.


Next Story

Most Viewed