డెడ్ స్టోరేజీలో మిడ్ మానేరు.. మిషన్ భగీరథపై ఎఫెక్ట్ తప్పదా..?

by Disha Web Desk 4 |
డెడ్ స్టోరేజీలో మిడ్ మానేరు.. మిషన్ భగీరథపై ఎఫెక్ట్ తప్పదా..?
X

బోయినిపల్లి మండలంలోని కొదురుపాక వద్ద నిర్మించిన శ్రీరాజరాజేశ్వరి (మిడ్ మానేరు) జలాశయంలో నీళ్లు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఎండల తీవ్రం కావడంతో నీరు తగ్గి డెడ్ స్టోరేజ్‌కు చేరువలోకి వచ్చాయి. ఓ వైపు మేడిగడ్డ నుంచి నీరు రాకపోవడం, మరోవైపు మండుతున్న ఎండలతో డ్యామ్‌లోని జలాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు కళకళలాడిన జలాశయం నేడు వెలవెలబోతుంది. పూర్తిగా నీటిమట్టం తగ్గడంతో ముంపునకు గురైన రుద్రవరం, అనుపురం, కోడిముంజ, శభాష్‌పల్లి తదితర గ్రామాల్లోని కట్టడాలు, పంట పొలాలు పూర్తిగా బయటపడ్డాయి. వేసవికాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే, జూన్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లలో నీటి ప్రవాహం తగ్గింది. 25 టీఎంసీల కెపాసిటీ కలిగిన మిడ్ మానేరు ప్రస్తుత నీటిమట్టం 6టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతో డ్యామ్‌లో నీరు తగ్గితే మిషన్ భగీరథ సరఫరాపై భారీ ఎత్తున ప్రభావం చూపే పరిస్థితి కనబడుతోంది.

దిశ, వేములవాడ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బోయినిపల్లి మండలంలోని కొదురుపాక వద్ద నిర్మించిన శ్రీరాజరాజేశ్వరి (మిడ్ మానేరు) జలాశయంలో నీళ్లు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఎండల తీవ్రం కావడంతో నీరు తగ్గి డెడ్ స్టోరేజ్‌కు చేరువలోకి వచ్చాయి. ఓ వైపు మేడిగడ్డ నుంచి నీరు రాకపోవడం, మరోవైపు మండుతున్న ఎండలతో డ్యామ్‌లోని జలాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు కళకళలాడిన జలాశయం నేడు వెలవెలబోతుంది. పూర్తిగా నీటిమట్టం తగ్గడంతో ముంపునకు గురైన రుద్రవరం, అనుపురం, కోడిముంజ, శభాష్‌పల్లి తదితర గ్రామాల్లోని కట్టడాలు, పంట పొలాలు పూర్తిగా బయటపడ్డాయి. ఈ దృశ్యాలను చూసి నిర్వాసితులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్లీ కంటతడి పెట్టుకునే పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే చాలా మంది నిర్వాసితులు వారు కోల్పోయిన మధుర జ్ఞాపకాలను చూసుకునేందుకు పాత గ్రామాల్లోకి పరుగులు పెడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంటుంది.

ఆందోళనలో జనాలు..

రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న మానేరు జలాలను చూస్తూ సమీప గ్రామాల ప్రజలు,రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే,మే,జూన్ మొదటి వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని, సరే సాగునీరు సంగతి పక్కన పెడితే, కనీసం త్రాగునీరైనా దొరుకుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బావులు,బోర్లలో నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గిందని ఇలాగైతే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు.

డెడ్ స్టోరేజ్‌కు చేరువలో..

25 టీఎంసీల కెపాసిటీ కలిగిన మిడ్ మానేరు ప్రస్తుత నీటిమట్టం 6 టీఎంసీలు మాత్రమే.. గతేడాది ఇదే సమయానికి డ్యామ్ నీటి మట్టం 15 టీఎంసీలు ఇదే విషయం ఇటు ప్రజలను,అటు అధికారులను కలవరపెడుతోంది. అసలే వేసవి కాలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. నీటి మట్టం 6 టీఎంసీలే ఉంది. బయటకు వదిలే నీటిని నిలిపివేసిన మండుతున్న ఎండలతో నీటి ఆవిరి అయ్యే పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం జూన్ మొదటి వారం,వర్షాలు కురిసే సమయం వరకైనా డ్యామ్ లో నీటిని కాపాడగలమా అనే సందేహం అధికారుల నుంచి వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

మిషన్ భగీరథపై ఎఫెక్ట్...

ఇక అన్నింటితో పోలిస్తే డ్యామ్ లో నీరు తగ్గడం అనేది మిషన్ భగీరథ నీటి సరఫరాపై భారీ ఎత్తున ప్రభావం చూపే పరిస్థితి కనబడుతోంది. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించేందుకు డ్యామ్ సమీపంలోని రుద్రవరం వద్ద ఇంటెక్ వెల్ నిర్మించారు. ఇక్కడి నుంచి రెండు మోటర్ల సాయంతో మిడ్ మానేరు నీటిని తోడి ఆగ్రహారం వద్ద ఉన్న ట్రీట్ మెంట్ ప్లాంట్ తో పాటు సిరిసిల్ల పట్టణానికి నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మిడ్ మానేరు నీటి మట్టం తగ్గుముఖం పట్టిన మిషన్ భగీరథ నీటికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక ప్రత్యేక కాలువ నిర్మించి, ఇంటెక్ వెల్ లోకి నీటి సరఫరా అందిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు తప్పితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ బాగానే కొనసాగుతూ వస్తుంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా డ్యామ్ లోని నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరువవ్వడం,నిన్నమొన్నటి వరకు 6వేలు జీపీఎం ఔట్ ఫ్లో కలిగిన మానేరు నీరు నేడు 4వేల 800 జీపీఎంగా మారడం నీటి సరఫరాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయం పై సంబంధిత శాఖకు చెందిన ఓ అధికారిని సంప్రదించగా ఇప్పుడు డ్యామ్ లో ఉన్న నీరు అలాగే ఉంటే సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఒకవేళ నీటిని దిగువకు వదిలిన, మండుతున్న ఎండలతో ఆవిరి రూపంలో ఎక్కువ నీరు వెళ్లిపోయి నీటి మట్టం తగ్గిన సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.



Next Story

Most Viewed