కరోనా వైరస్ లీకైంది అక్కడి నుండే.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా సైంటిస్ట్

by Disha Web |
కరోనా వైరస్ లీకైంది అక్కడి నుండే.. సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా సైంటిస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహ్మమారి పుట్టుక గురించి ఓ అమెరికా సైంటిస్ట్ విస్తూపోయే నిజాలను వెల్లడించారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ తయారు చేశారని అమెరికాకు చెందిన ఎపిడెమియాలజిస్ట్ అండ్రూ హఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన హఫ్ గతంలో చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పనిచేయడంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ''ది ట్రూత్ అబౌట్ వుహాన్'' అనే బుక్‍లో హఫ్ ఈ సంచలన విషయాలను పేర్కొ్న్నారు. యావత్ మానవాళిని భయాందోళనకు గురిచేసిన కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్‍లోనే తయారు చేసిన మ్యాన్-మేడ్ వైరస్ అని పేర్కొన్నారు.

కరోనా వైరస్‍ల గురించి పరిశోధన చేసేందుకు వుహాన్ ల్యాబ్‍కు అమెరికా నిధులు సమకూర్చిందని ఆరోపించారు. పరిశోధనలు చేస్తోన్న సమయంలోనే వుహన్ ల్యాబ్ నుండి డేంజరస్ కరోనా వైరస్ లీక్ అయ్యిందని హఫ్ తన ది ట్రూత్ అబౌట్ వుహాన్ అనే బుక్‍లో రాసుకొచ్చారు. కరోనా వైరస్‌పై గతంలో కూడా వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు బయో సెక్యూరిటీ లేదని.. ఈ కారణంగా ల్యాబ్ నుండి కరోనా వైరస్ లీక్ అయిందని హఫ్ ఆరోపించారు.

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మొదట బయటపడింది చైనాలోనే అన్న సంగతి తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ భయంకరమైన వైరస్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ కరోనా వైరస్ కారణంగా కొన్నాళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా యావత్ మానవాళి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసిన ఈ కరోనా వైరస్.. ప్రపంచ వ్యా్ప్తంగా కోట్లమందిని పొట్టన బెట్టుకుంది.

అయితే, కరోనా వైరస్ పుట్టుకపై మొదటి నుండి ప్రపంచ దేశాలన్ని చైనానే నిందిస్తున్నాయి. ఈ వైరస్ పుట్టుకపై అధ్యయానం చేసిన డబ్ల్యూహెచ్‍వో కరోనా వైరస్ గబ్బిలాల నుండి వ్యాప్తి చెందిందని చెప్పినప్పటికీ.. ఆ వైరస్ మాత్రం చైనాలోని వుహాన్ ల్యాబ్ నుండే లీక్ అయిందని పలువురు సైంటిస్ట్‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పుట్టుకకు కారణమైందని ఆరోపిస్తున్న వుహాన్ ల్యాబ్‌లో పని చేసిన సైంటిస్ట్.. కరోనా మ్యాన్ మేడ్ వైరస్ అని.. ఇది వుహాన్ ల్యాబ్‌లోనే చేశారని పేర్కొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా హఫ్ సొంతదేశమైన అమెరికాపై ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Next Story