స్త్రీధనంపై పూర్తి హక్కు మహిళదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Dishanational4 |
స్త్రీధనంపై పూర్తి హక్కు మహిళదే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘స్త్రీధన్’ అంటే పెళ్లి టైంలో లేదా పెళ్లికి ముందు వధువుకు వచ్చే నగలు, ఇతర కానుకలు. దీనికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్త్రీ ధన్‌పై పూర్తి హక్కు మహిళలదేనని.. దానిపై భర్తకు నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘‘స్త్రీ ధన్ అనేది సంబంధిత మహిళకు చెందిన పూర్తి ఆస్తి. దాన్ని ఆమె ఇష్టానుసారంగా ఖర్చు చేసుకోవచ్చు’’ అని కోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునే ఉద్దేశంతో భార్య స్త్రీ ధనాన్ని అందిస్తే.. దాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. 2009 సంవత్సరంలో కేరళకు చెందిన ఓ మహిళకు పెళ్లయింది. పెళ్లి టైంలో ఆమెకు కుటుంబం 89 బంగారు నాణేలను అందించింది. భర్తకు రూ.2 లక్షల చెక్కును అందజేసింది. పెళ్లయిన మరుసటి రోజు ఆ బంగారు నాణేలను భద్రంగా ఉంచుతానని నమ్మబలికిన భర్త.. వాటిని తీసుకెళ్లి తన తల్లికి అప్పగించాడు. అనంతరం తన అప్పులు కట్టుకోవడానికి ఆ బంగారు నాణేలను అమ్మేశాడు. కొన్ని రోజుల తర్వాత ఈవిషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త నుంచి తన బంగారాన్ని తిరిగి ఇప్పించాలంటూ సదరు మహిళ కేరళ హైకోర్టులో పిటిషన్ వేసినా.. అది నిలవలేకపోయింది. ఎందుకంటే.. ఆ బంగారాన్ని భర్త, అత్త కలిసి దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది. చివరగా ఆ మహిళ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ‘‘2009 సంవత్సరంలో 89 బంగారు నాణేల రేటు రూ.8.90 లక్షలు ఉండేది. ఆనాడు వాటిని తీసుకొని వాడుకున్నందుకు పరిహారంతో కలుపుకొని రూ.25 లక్షలను భార్యకు భర్త చెల్లించాలి. ఈ పేమెంట్ ఆరు నెలల్లోగా జరగాలి’’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.



Next Story

Most Viewed