నట్టేట ముంచిన బీజేపీకి బీసీల ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు: శ్రీనివాస గౌడ్

by Disha Web Desk 19 |
నట్టేట ముంచిన బీజేపీకి బీసీల ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు: శ్రీనివాస గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఏకైక పరిష్కారమని, పదేండ్లుగా బీసీలను నట్టేట ముంచిన బీజేపీకి బీసీల ఓట్లడిగె నైతిక అర్హత లేదని బీసీ సంక్షేమ సంఘం వ్యాఖ్యానించింది. కులగణన జరగడం ద్వారా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు పెరగడం సాధ్యమవుతుందని పేర్కొన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలకాలని తీర్మానం చేసినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ స్పష్టం చేశారు. పదేండ్ల బీజేపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, ఓబీసీకి చెందిన ప్రధానిగా మోడీ ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు, దేశవ్యాప్తంగా ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు, మేధావులతో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం (మేధోమధనం)లో చర్చల అనంతరం కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవులు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బీసీ శ్రేణులు తరలివచ్చారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి ఓబీసీ ప్రధానిగా మోడీ గుర్తింపు పొందారని, కానీ ఓబీసీ డిమాండ్లలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. బీజేపీ పాలనలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా అన్యాయం జరిగిందని ఆరోపించారు. సామాజిక రిజర్వేషన్లను నీరుగార్చడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా అగ్రవర్ణ రిజర్వేషన్లు తీసుకొచ్చి రిజర్వేషన్ల లక్ష్యాన్ని బీజేపీ నీరుగార్చిందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీల అకాంక్షలు నెరవేరవన్న ఆందోళనను వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం సామాజిక ఆర్థిక సమగ్ర కులగణన అంశంపైనే చేసి బీసీ రిజర్వేషన్లను పెంచుతామని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, సామాజిక రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత తదితర డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చడంతోపాటు వాటిని అమలు చేస్తామని వాగ్దానం ఇచ్చినందున బీసీలందరూ కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతృత్వంలోనే బీసీల ఆకాంక్షలు నెరవేరుతాయని, అందుకోసం ఆ కూటమిని అధికారంలోకి తేవడానికి బీసీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీలు వారి లక్ష్యసాధన కోసం ప్రయాణం కొనసాగించాలని, అందుకు కొన్ని రాజకీయ నిర్ణయాలూ తీసుకోవాలన్నారు. బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామన్న పార్టీకి అండగా నిలబడాల్సిన సామాజిక బాధ్యత బీసీలపై ఉందన్నారు. బీసీలు వారి హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండాలన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో సమగ్ర కులగనణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో, క్యాబినెట్‌లో తీర్మానం చేసి కులగనను చేపట్టడానికి జీవో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఈ ఎన్నికలలో అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ కులాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. బీసీల రాజకీయ మేధోమధన సదస్సులో 10 తీర్మానాలకు ఆమోదం లభించింది. బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తామని ఇండియా కూటమికి మద్దతు తెలుపింది.

Next Story

Most Viewed