ఉప్పల్‌లో హైదరాబాద్ ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు

by Dishanational3 |
ఉప్పల్‌లో హైదరాబాద్ ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు
X

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు బ్రేక్ పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 206/7 స్కోరు చేసింది. రజత్ పటిదార్(50), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్(3/30) సత్తాచాటాడు. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 171/8 స్కోరుకే పరిమితమైంది. షాబాజ్ అహ్మద్(40 నాటౌట్) టాప్ స్కోరర్. అభిషేక్(31), కెప్టెన్ కమిన్స్(31) కాసేపు మెరుపులు మెరిపించారు.

తడబడిన హైదరాబాద్

ఛేదనలో హైదరాబాద్ తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) వికెట్ కోల్పోవడంతో ఆ జట్టు తడబాటు మొదలైంది. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(31) తన దూకుడును కొనసాగిస్తూ రెచ్చిపోయాడు. అయితే, ఆ జోరు కాసేపే. యశ్ దయాల్ బౌలింగ్‌లో కీపర్ కార్తీక్‌కు చిక్కి వెనుదిరిగాడు. మార్‌క్రమ్(13), క్లాసెన్(7) విఫలమవడంతో పవర్ ప్లేలో 56/4తో హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నితీశ్ రెడ్డి(7), అబ్దుల్ సమద్(10) కూడా నిరాశపరిచారు. దీంతో హైదరాబాద్ 120 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందేమో అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పాట్ కమిన్స్(31) మెరుపులతో జోష్ తెచ్చాడు. తనలోని బ్యాటర్‌ను బయటకు తీసిన అతను 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. గ్రీన్ బౌలింగ్‌లో కమిన్స్ అవుటవడంతో హైదరాబాద్ ఓటమి ఖరారైంది. 150 పరుగుల్లోపే ముగిస్తుందనుకున్న ఇన్నింగ్స్.. షాబాజ్ అహ్మద్(40 నాటౌట్) అజేయ పోరాటంతో హైదరాబాద్ 171 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. విల్ జాక్స్, యశ్ దయాల్‌కు చెరో వికెట్ దక్కింది.

రజత్ పటిదార్ ధనాధన్

అంతకుముందు బెంగళూరుకు ఓపెనర్లు డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభాన్ని అందించారు. భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్‌లో డు ప్లెసిస్ మూడు ఫోర్లు బాదగా.. కమిన్స్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో కోహ్లీ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. దూకుడుగా మొదలైన ఇన్నింగ్స్‌లో 4వ ఓవర్‌లో ఓ కుదుపు. నటరాజన్ బౌలింగ్‌లో డు ప్లెసిస్(25)ను అవుటవడంతో ఆర్సీబీ 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్(6) నిరాశపరిచాడు. అనంతరం కోహ్లీకి రజత్ పటిదార్ తోడయ్యాడు. మొదట ధాటిగా ఆడిన కోహ్లీ వికెట్లు పడుతుండటంతో నెమ్మదించాడు. ఆచితూచి ఆడిన అతను 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే పటిదార్ రెచ్చిపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు బ్యాటు ఝుళిపించిన అతను మార్కండే బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదేశాడు. దీంతో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆర్సీబీ పరుగుల వేగానికి జయదేవ్ ఉనద్కత్ కళ్లెం వేశాడు. వరుస ఓవర్లలో రజత్ పటిదార్(50), కోహ్లీ(51), మహిపాల్ లోమ్రోర్(7)లను పెవిలియన్ పంపాడు. దీంతో ఆర్సీబీ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, కామెరూన్ గ్రీన్(37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కార్తీక్(11), స్వప్నిల్ సింగ్(12) సహకారంతో స్కోరును 200 దాటించాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీయగా.. నటరాజన్‌కు 2 వికెట్లు, కమిన్స్, మార్కండే‌లకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 206/7(20 ఓవర్లు)

కోహ్లీ(సి)అబ్దుల్ సమద్(బి)జయదేవ్ ఉనద్కత్ 51, డుప్లెసిస్(సి)మార్‌క్రమ్(బి)నటరాజన్ 25, విల్ జాక్స్(బి)మార్కండే 6, రజత్ పటిదార్(సి)అబ్దుల్ సమద్(బి)జయదేవ్ ఉనద్కత్ 50, గ్రీన్ 37 నాటౌట్, లోమ్రోర్(సి)కమిన్స్(బి)జయదేవ్ ఉనద్కత్ 7, కార్తీక్(సి)అబ్దుల్ సమద్(బి)కమిన్స్ 11, స్వప్నిల్ సింగ్(సి)అభిషేక్ శర్మ(బి)నటరాజన్ 12; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 48-1, 65-2, 130-3, 140-4, 161-5, 193-6, 206-7

బౌలింగ్ : అభిషేక్ శర్మ(1-0-10-0), భువనేశ్వర్(1-0-14-0), కమిన్స్(4-0-55-1), నటరాజన్(4-0-39-2), షాబాజ్ అహ్మద్(3-0-14-0), మార్కండే(3-0-42-1), జయదేవ్ ఉనద్కత్(4-0-30-3)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 171/8(20 ఓవర్లు)

అభిషేక్ శర్మ(సి)కార్తీక్(బి)యశ్ దయాల్ 31, హెడ్(సి)కర్ణ్ శర్మ(బి)విల్ జాక్స్ 1, మార్‌క్రమ్ ఎల్బీడబ్ల్యూ(బి)స్వప్నిల్ సింగ్ 7, నితీశ్(బి)కర్ణ్ శర్మ 13, క్లాసెన్(సి)గ్రీన్(బి)స్వప్నిల్ సింగ్ 7, షాబాజ్ అహ్మద్ 40 నాటౌట్, అబ్దుల్ సమద్(సి అండ్ బి)కర్ణ్ శర్మ 10, కమిన్స్(సి)సిరాజ్(బి)గ్రీన్ 31, భువనేశ్వర్(సి)సిరాజ్(బి)గ్రీన్ 13, జయదేవ్ ఉనద్కత్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10.

వికెట్ల పతనం : 3-1, 37-2, 41-3, 56-4, 69-5, 85-6, 124-7, 141-8

బౌలింగ్ : విల్ జాక్స్(2-0-23-1), సిరాజ్(4-0-20-0), యశ్ దయాల్(3-0-18-1), స్వప్నిల్ సింగ్(3-0-40-2),కర్ణ్ శర్మ(4-0-29-2), ఫెర్గూసన్(2-0-28-0), గ్రీన్(2-0-12-2)



Next Story

Most Viewed