మహారాష్ట్ర ‘ఎంవీఏ’లో చీలిక!..ఒంటరిగా బరిలోకి ప్రకాష్ అంబేద్కర్

by Dishanational2 |
మహారాష్ట్ర ‘ఎంవీఏ’లో చీలిక!..ఒంటరిగా బరిలోకి ప్రకాష్ అంబేద్కర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ మహారాష్ట్రలోని ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిలో సంక్షోభం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరత్ చంద్రపవార్) వర్గం, వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. లోక్‌సభ సీట్ల పంపకంలో ఈ పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం. ఇంకా సీట్ షేరింగ్ ఖరారు కాకముందే శివసేన(యూబీటీ) 16 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించడంతో పలువురు కాంగ్రెస్ నేతలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ షేరింగ్‌లో భాగంగా మూడు సీట్లను కాంగ్రెస్ ఆశించింది. కానీ ఈ సీట్లను శివసేన తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విబేధాలు నెలకొన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఎంవీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 8 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ ప్రకటించారు. ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. సీట్ షేరింగ్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఎంవీఏ కూటమిపై విమర్శలు గుప్పించారు. రాజవంశ రాజకీయాలను కాపాడుకోవడానికి ఎంవీఏ..బీవీఏను వాడుకుంటుందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు సీటు షేరింగ్ ఫార్ములాను ఖరారు చేయడంలో ఎంవీఏ తీవ్ర జాప్యం చేసిందని తెలిపారు. దీంతో శివసేన(యూబీటీ), వీబీఏ అభ్యర్థులను ప్రకటించడంతో ఎంవీఏ కూటమిలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ముంబై సీట్లపై శివసేన vs కాంగ్రెస్

సీట్ షేరింగ్ విషయంలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. సీట్ల పంపకం విషయంలో చర్చలు జరిగినప్పటికీ ముంబైకి సంబంధించిన వాటిలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్ నియోజక వర్గాల నుంచి కాంగ్రెస్ సీట్లు ఆశించగా..ఈ మూడు సీట్లతో పాటు ముంబై సౌత్ నుంచి కూడా శివసేన(యూబీటీ)సీట్లు ఆశించింది. అయితే కాంగ్రెస్ పట్టుబట్టిన సీట్లలో శివసేన తమ అభ్యర్థులను ప్రకటించింది.దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటు ఎన్నికలకు ముందు కూటమిలో ఎదురుదెబ్బలు తగలడంతో కూటమి నేతలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఉమ్మడి శివసేన 48 స్థానాలకు గాను 22 స్థానాల్లో బరిలోకి దిగింది.


Next Story