- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోబోను మట్టికరిపించిన మనిషి.. కానీ ఇదే ఆఖరి గెలుపు! ‘మనిషి వర్సెస్ మెషిన్’ పోరులో సంచలనం
అమెరికాలో జరిగిన ఒక ఆసక్తికరమైన ‘మనిషి వర్సెస్ మెషిన్’ (Man vs. Machine) పోరులో మనిషి అద్భుత విజయం సాధించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో జరిగిన ఒక ఆసక్తికరమైన ‘మనిషి వర్సెస్ మెషిన్’ (Man vs. Machine) పోరులో మనిషి అద్భుత విజయం సాధించాడు. ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘ఫిగర్ ఏఐ’ (Figure AI) నిర్వహించిన 10 గంటల ప్యాకేజీల సార్టింగ్ పోటీలో ఏఐ హ్యూమనాయిడ్ రోబోపై ఒక సాధారణ ఇంటర్న్ (మనిషి) పైచేయి సాధించి సత్తా చాటాడు. అయితే, రోబోపై మనిషి సాధించిన ఆఖరి విజయం బహుశా ఇదే కావొచ్చని సాక్షాత్తూ ఆ కంపెనీ సీఈఓ ప్రకటించడం గమనార్హం.
పోటీ ఎలా జరిగిందంటే..
ఫిగర్ ఏఐ సంస్థ ఈ పోటీని ఒక వేర్‌హౌస్‌లో లైవ్‌స్ట్రీమ్ ద్వారా నిర్వహించింది. కంపెనీకి చెందిన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘F.03’ (హెలిక్స్-02 ఏఐతో పనిచేస్తుంది), అలాగే సంస్థలో పనిచేస్తున్న ‘ఎయిమ్’ (Aime) అనే ఇంటర్న్ మధ్య 10 గంటల పాటు ఈ వార్ జరిగింది. ప్యాకేజీపై ఉన్న బార్‌కోడ్‌ను గుర్తించి, దాన్ని తీసుకుని కన్వేయర్ బెల్ట్‌పై బార్‌కోడ్ కిందికి ఉండేలా వేయడమే వీరి టార్గెట్. కాలిఫోర్నియా కార్మిక చట్టాల ప్రకారం ఎయిమ్ (మనిషి)కి భోజన విరామం, అలాగే విశ్రాంతి సమయాన్ని (పెయిడ్ రెస్ట్ బ్రేక్స్) కల్పించి మరీ ఈ పోటీని కొనసాగించారు.
కుందేలు - తాబేలు రేసును తలపించిన పోరు
మనిషికి విరామ సమయం ఇచ్చినప్పుడు కుందేలు-తాబేలు కథలాగా రోబో అలుపు లేకుండా వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఆ సమయంలో రోబోదే విజయం అని అంతా అనుకున్నారు. కానీ, విశ్రాంతి తర్వాత తిరిగొచ్చిన ఎయిమ్.. తన అద్భుతమైన వేగంతో యంత్రాన్ని వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. ఎవరూ కూడా రోబో గెలవడం కోసం కావాలని ఓడిపోవాలని ఆ ఇంటర్న్‌కు చెప్పలేదని, అతను తన పూర్తి సామర్థ్యంతో ఈ విజయం సాధించాడని కంపెనీ తెలిపింది.
ఫైనల్ స్కోర్లు ఇవే..
మనిషి (ఎయిమ్): 12,924 ప్యాకేజీలు (ఒక్కో ప్యాకేజీకి 2.79 సెకన్ల సమయం)
రోబో (F.03): 12,732 ప్యాకేజీలు (ఒక్కో ప్యాకేజీకి 2.83 సెకన్ల సమయం)
చేయి విరిగిపోయినంత పనైంది..
ఈ సుదీర్ఘమైన పోరు తర్వాత తన ఎడమ చేతి ముందు భాగం దాదాపుగా విరిగిపోయినంత పనైందని విజేత ఎయిమ్ నవ్వుతూ చెప్పడం.. మనిషి పడిన శారీరక శ్రమను తెలియజేస్తోంది. మరోవైపు రోబో అలుపు లేకుండా పని చేస్తూ భవిష్యత్తులో యంత్రాల ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. ఈ ‘F.03’ రోబో ఇటీవల 24 గంటల పాటు ఏకధాటిగా పనిచేసి లక్షకు పైగా ప్యాకేజీలను సార్ట్ చేయడం విశేషం. ఒక మనిషి రోబోపై గెలవడం బహుశా ఇదే చివరిసారి అవుతుందని ఫిగర్ ఏఐ సీఈఓ బ్రెట్ అడ్‌కాక్ ఎక్స్ వేదికగా వీడియోలు పంచుకున్నారు. ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్‌తో పోరాడి గెలిచి ప్రాణాలు వదిలిన ప్రసిద్ధ ‘జాన్ హెన్రీ’ (John Henry) కథను ఈ ఘటన గుర్తుచేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, టెక్నాలజీ వేగంగా దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో.. మనిషి తన ఉనికిని చాటుకోవడానికి చేసిన ఈ పోరాటం అందరినీ ఆకట్టుకుంటోంది.






