98 ఏళ్ల ఉక్రేనియన్ మహిళ రష్యాను ఓడిస్తానంటోంది..?!

by Disha Web Desk 20 |
98 ఏళ్ల ఉక్రేనియన్ మహిళ రష్యాను ఓడిస్తానంటోంది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌పై రష్యా చేప‌ట్టిన యుద్ధం ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ధ్వంసం చేసింది. బాంబు దాడుల‌కు సామాన్యుల ప్రాణాలు బ‌లైపోతున్నాయి. శిథిలాల దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అయినా, ఉక్రెయిన్ త‌న ధైర్య‌సాహ‌సాల‌ను ఏమాత్రం కోల్పోలేదు. అనేక ఆశాదీపాలు ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య ప్రజలను క్రుంగిపోకుండా కాపాడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ విదేశీ శాఖ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ విష‌యం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఈ పోస్ట్‌లో, ఓల్హా ట్వెర్డోఖ్లిబోవా అనే 98 ఏళ్ల మహిళ ఉక్రెయిన్ సైన్యంలో చేర‌తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఓల్హా వృద్ధురాలైనా యుద్ధ అనుభవం ఉన్న వీర మ‌హిళ‌. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈమె చురుకుగా పాల్గొంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఆదేశించిన తర్వాత, ఓల్హా తన మాతృభూమిని రక్షించడానికి సైన్యంలో చేరాలని ప్రతిపాదించారు. అయితే, ఆమె వయస్సు కారణంగా తిరస్కరించారు. అయితే, ఆమె క‌థ‌ను మాత్రం ఉక్రెయిన్ అధికారులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. "ఈ వ‌య‌సులోనూ ఆమె మళ్లీ త‌న దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. అన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ, వయస్సు కారణంగా ఆమెను తిరస్కరించాము, అయితే, ఆమె త్వరలో కీవ్‌లో మరో విజయాన్ని త‌ప్ప‌క జరుపుకుంటుందని మేము ఖచ్చితంగా న‌మ్ముతున్నాము!" అంటూ ట్విట్ట‌ర్ పోస్ట్‌లో అధికారులు పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కి వేల‌ల్లో లైక్‌లు, వంద‌ల్లో రీట్వీట్‌లు, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. నెటిజన్లు ఓల్హా ధైర్యసాహసాలు చూసి ఆమె చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు.


Next Story

Most Viewed