వరల్డ్ ఎకానమీ.. 2020 సవాల్!

by  |
వరల్డ్ ఎకానమీ.. 2020 సవాల్!
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఆయా దేశాల పాలకులకు 2020 సంవత్సరం అతిపెద్ద సవాలుగా మారనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎమ్ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా హెచ్చరించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘తీవ్రమైన ఆర్థిక మాంద్యం’లోకి దిగజారనుందని ఐఎమ్ఎఫ్ పేర్కొంది. కరోనా వైరస్ రాకమునుపే మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక రంగం దీని ప్రభావంతో తీవ్ర సంక్షోభం నుంచి తప్పించుకునే అవకాశం లేదని క్రిస్టిలినా అన్నారు. ఐఎమ్ఎఫ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ ఏడాది తొలి సగంలో ప్రపంచ ఆర్థిక రంగం అత్యధిక నష్టాన్ని చూడక తప్పదని హెచ్చరించారు.

అంతర్జాతీయంగా అన్ని దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధి, సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడం, థెరపీల వంటి అంశాలపై దృష్టి సారిస్తే, వాటి ఫలితాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమనే అంశం ఆధారపడిందని క్రిస్టిలినా తెలిపారు. వీలైనంత వేగంగా దేశాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి అవసరమైన చర్యలు తీసుకుంటే ఈ ఏడాది మూడవ త్రైమాసికానికి కొంత ఊరట ఉండొచ్చని చెప్పారు. 2021లో పరిణామాలు మెరుగుపడితే ఆ ఏడాది చివరి నాటికి కొంత సానుకూల పరిస్థితులను చూడగలమని, ప్రస్తుతం సంభవిస్తున్న మరణాలను వీలైనంత వేగంగా తగ్గించాల్సి ఉందని, వాటికి ప్రథమ ప్రాధాన్యమివ్వాలని క్రిస్టిలినా సూచనలిచ్చారు. అన్ని దేశాలు కరోనా మరణాలను తగ్గించేందుకు, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ బారిన పడి ఆర్థిక పరంగా దిగజారిన దేశాలకు అంతర్జాతీయ సమాజం మొత్తం కలిసికట్టుగా సహాయం చేయాల్సిన అవసరముందని, దానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని క్రిస్తిలినా పిలుపునిచ్చారు.

వాణిజ్య పరమైన వివాదాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత వంటి కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్నాళ్ల నుంచి మందగమనంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా విజృంభించడంతో తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనక తప్పదని క్రిస్టిలినా స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పోగొట్టుకున్నాయని, పర్యాటక రంగం దెబ్బతిందని, ఆహారం, మందులతోసహా అనేక సరుకుల దిగుమతిలో తీవ్రమైన ఆటంకాలను చూస్తున్నాయని ఐఎమ్ఎఫ్ పేర్కొంది. ఇప్పటికే కరోనా ధాటికి చైనా, ఇటలీ, దక్షిణ కొరియా దేశాల్లో తయారీ రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయని, ఆయా దేశాల్లో అన్ని రకాల సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పాలకులకు కరోనాను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదని ఆమె చెప్పారు.

Tags: Recession, Severe recession, global economy, imf, world bank, world economy, international monetary fund, coronavirus pandamic

Next Story

Most Viewed