మళ్లీ లాక్ డౌనా..? అమ్మో మేము మా ఊరుకు పోతాం

by  |
Busstand
X

బతుకు దెరువుకై వచ్చాము.. బతుకు భయంతో వెళ్తున్నాం.. ఉన్నన్ని రోజులు మా ఊర్లో లెక్క ఉన్నం. మా ఇంట్ల లెక్క తిన్నం. మాయ దారి రోగం మల్లెక్కువైతందట, బళ్లు బంద్ అయినై. బస్సులు బంద్ అయితే…యాడ గానోల్లమైతం. పనులు బందువెట్టినం.. మావూరికెళ్తన్నం. అంతా మంచిగుంటే మల్లత్తం ఈ ఊరికి అంటూ వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. – దిశ, కరీంనగర్ సిటీ

జిల్లాలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ లాక్ డౌన్ అంటూ పుకార్లు షికార్లు చేయడంతో భయపడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలో గతేడాది పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు ఉంటాయనే భయంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారంతా రెండు రోజులుగా ముల్లె మూట సర్దుకుని తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు జిల్లా లోని వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, మిల్క్ డైరీలు, నిర్మాణరంగాల్లో అధికంగా ఉన్నారు. ఆయా రంగాల్లో ఇప్పుడిపుడే పనులు ముమ్మరమవుతుండగా, ఎకనామికల్ మార్కెట్ ఊపందుకుంటుంది. కార్మికులకు కూడా చేతి నిండా పని లభ్యమవుతుంది. ఈ తరుణంలో మరోసారి కరోనా మహమ్మారి తన విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్ధమవుతుండగా, విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు, సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం నుంచి విద్యాసంస్థలన్నీ నిరవధికంగా మూతపడ్డాయి. దీంతో బెంబేలెత్తిన కూలీలంతా ఇంటిబాట పట్టారు.

కరోనా భయంతో కొనసాగిన లాక్ డౌన్ మూలంగా అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయి. తినడానికి ఒక్క పూట భోజనం లభించక వలస కూలీలంతా రోజుల తరబడి పస్తులున్నారు. ప్రభుత్వ సడలింపులతో ఏప్రిల్, మే నెలల నుంచి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి వారి గ్రామాలకు నడిచి వెళ్లారు. అనంతరం సాధారణ పరిస్థితులతో, పరిశ్రమలు తెరిచేందుకు ప్రభుత్వం విడతల వారీగా అనుమతులిచ్చింది. దీంతో, అంతా కుదుట పడుతుందనుకుని నవంబర్ నుంచి తిరిగి వచ్చారు. ఈ ఏడాది జనవరి వరకు అంతంత మాత్రంగానే పనులు లభించాయి. క్రమేపీ పుంజుకుంతుండగా, ఇటీవలి కాలంలోనే వేగం పెరిగింది. యథావిధిగా తమకు ఉపాధి లభిస్తుందనే ధీమాతో ఉన్న వారికి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. దేశమంతా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కాగా, రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా విద్యా సంస్థ ల్లో విపరీతంగా పాజిటివ్ కేసులు తెలుతున్నాయి. ఈ క్రమంలో వీటిని మూసివేసినా, లాక్ డౌన్ విధించే అవకాశముందనే చర్చ సాగుతోంది. ఇదే గనుక జరిగితే, మరోసారి తాము ఇబ్బందులు పడక తప్ప దనే భావనతో, కూలీలంతా తమ తమ ప్రాంతాలకు పయనమయ్యారు.

Next Story

Most Viewed