నో టౌన్ ప్లానింగ్.. అధికారులకు భారం

by  |
నో టౌన్ ప్లానింగ్.. అధికారులకు భారం
X

దిశ, కూకట్‌పల్లి: జీహెచ్ఎంసీలో అత్యధిక రాబడి తీసుకొచ్చే టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు, విధుల నిర్వహణలో ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ అంటూ లేకుండా పోయింది. భవన నిర్మాణాల అనుమతులు, రోడ్డు విస్తరణ పనులతోపాటు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం, నాలాల పనులు, కోర్టు కేసులు ఇలా అనేక పనుల భారంతో ఉన్న ఒక్కరిద్దరు అధికారులపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కూకట్ పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్ల పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సరిపడ అధికారులు, సిబ్బంది లేక వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ 6 డివిజన్లు ఉన్నాయి. ఆరు డివిజన్లకు సేవలు అందించడానికి ఒక ఏసీపీ (అసిస్టెంట్ సిటీ ప్లానర్), ఇద్దరు టీపీఎస్ (టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్), ఇద్దరు చైన్ మెన్లు అందులో ఒకరు వయస్సు పై బడిన వారు విధులు నిర్వహిస్తున్నారు.

అదే విధంగా మూసాపేట్ సర్కిల్ పరిధిలో కేపీహెచ్భీకాలనీ, బాలాజీనగర్, మూసాపేట్, అల్లాపూర్, ఫతేనగర్ డివిజన్లకు ఒక ఏసీపీ, ఇద్దరు టీపీఎస్ లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు, చైన్ మెన్లు లేరు. ఇదిలా ఉండగా గతంలో ఒక్కో డివిజన్ కు ఒక టీపీఎస్, ఒక చైన్ మెన్ విధులు నిర్వహించే వారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది కొరతతో ఉన్న సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు.

సిబ్బందిపై పని భారం..

కూకట్ పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్లంటేనే అక్రమ కట్టడాలు, వివాదాస్పద నిర్మాణాలకు పెట్టింది పేరు. 2007నుంచి 2021వరకు కేవలం కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోనే 270కోర్టు కేసులు నమోదయ్యాయి. ఇందులో 185కేసులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. దీనికి తోడు కొంతకాలంగా సెల్లార్లు ఉన్న భవనాలకు నోటీసులు, వరద సాయం అందించే విధులు, ఎన్నికలు, రోడ్డు విస్తరణ పనులు ఇలా అనేక పనులు అప్పగించడంతో అధికారులు నిరంతరం బిజిబిజీగా ఉంటున్నారు. సాధారణ ప్రజలు భవన నిర్మాణాల కోసం చేసుకునే దరఖాస్తుల కోసం, అక్రమ నిర్మాణాల ఫిర్యాదుల కోసం ప్రజలు సర్కిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారు.

అధికారులకు అదనపు భారం..

జంట సర్కిళ్ల పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చడానికి గతంలో సర్కిల్ కార్యాలయంలో ఓ వాహనం, పది మంది సిబ్బంది, ఓ జేసీపీ, గ్యాస్ కట్టర్, కంప్రెషర్ మిషన్ అందుబాటులో ఉండేది. గత కొంత కాలంగా నిర్మాణాలు కూల్చేందుకు యంత్రాంగం లేకపోవడంతో అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చాలన్న సొంతంగా డబ్బు పెట్టుకుని అడ్డా కూలీలను, జేసీపీని అద్దెకు తీసుకురావాల్సి వస్తుంది. దీంతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అధిక భారం అవుతుండడంతో అధికారులు వెనకంజ వేస్తున్నారు.

పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాం

మూడు డివిజన్లకు ఒక టీపీఎస్ చొప్పున సర్కిల్ కు ఇద్దరు మాత్రమే అధికారులు ఉన్నారు. దీంతోపాటు 6 డివిజన్లకు ఇద్దరు చైన్ మెన్లు ఉండడంతో పని భారం పెరిగింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నా సొంతంగా కార్మికులను, యంత్రాలను సమకూర్చుకోవాల్సి వస్తుంది. వారానికి మూడు రోజులు కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. కోర్టుకు వెళ్తే రోజంతా కోర్టులోనే గడిచి పోతుంది.


Next Story

Most Viewed