యాచకురాలి ఆకలిచావు

by  |
యాచకురాలి ఆకలిచావు
X

దిశ, మహబూబ్‌నగర్:
కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. కాగా, ఈ ప్రభావం యాచకులపై తీవ్రంగా పడిందనే చెప్పాలి. రోడ్లపై జన సంచారం లేకపోవడంతో యాచకులు ఆకలికి అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకలికి అలంటించి ఒక మహిళ మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. అయినా వారిని పట్టించుకునేనాథుడు లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రోజు ఉదయం పూట, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో.. హోటళ్ల వద్ద లేక రోడ్లపై వచ్చి వెళ్లే వారు తమకు తోచింది ఇస్తే యాచకులు కడుపు నింపుకునేవారు. అదేవిధంగా పట్టణంలో మధ్యాహ్న భోజన సెంటర్ల వద్ద రూ.5ల భోజనంతో తమ కడుపు నింపుకునేవారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా మారింది. భోజన శాలలన్నీ మూతపడ్డాయి. దీంతో కడుపు ఎలా నింపుకోవాలో అర్థం కాక యాచకులు ఆకలికి అలమటిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రోడ్లపైన, రైల్వేస్టేషన్ వద్ద వారు దీన స్థితిలో తల దాచుకుంటున్నారు. ఎవరైనా దయార్థ హృదయంతో ఏమైనా పెడితేనే తినాల్సిన పరిస్థితి. ఇలా ఒక పూట తింటే మరో పూట తిండి దొరుకుతుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రభుత్వం.. ఇలాంటి వారి కోసం భోజన ఏర్పాట్లు చేస్తుండగా, జిల్లాకేంద్రాల్లో ఈ తరహా చర్యలు కనిపించడం లేదు.

ప్రభుత్వ అధికారులు ఈ విషయం పట్ల చొరవ తీసుకుని వారి ఆకలి బాధను తీర్చాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేదంటే కరోనా పరిస్థితి ఎలా ఉన్నా, జిల్లాలో ఆకలిచావులు ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Tags: Corona effect, Lock Down, Hunger Deaths, Mahabubnagar


Next Story

Most Viewed