మద్యం దుకాణాలు ఓపెన్… బారులు తీరిన మందుబాబులు

by  |
మద్యం దుకాణాలు ఓపెన్… బారులు తీరిన మందుబాబులు
X

45 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ సడలింపులతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం 11 గంటల నుంచి వైన్ షాపులను ఓపెన్ చేశారు. సాయంత్రం 7 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. దీంతో మద్యం షాపుల వద్దకు జనాలు క్యూ కట్టారు.

45 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుస్తారన్న సమాచారంతో దుకాణాలు తెరవకముందే పడిగాపులు కాశారు. అయితే వలంటీర్లు, పోలీసులు ఉండడంతో దుకాణాలను దూరం నుంచి పరిశీలిస్తూ ఉండిపోయారు. 11 గంటలయ్యే సరికి మద్యం షాపుల ముందు ప్రజలు బారులు తీరారు. కరోనా వైరస్, భౌతిక దూరం వంటి వాటిని పక్కన పెట్టేసి మద్యం కోసం వెంపర్లాడారు.

గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, విశాఖపట్టణం జిల్లా కేంద్రాల్లోని మద్యం దుకాణాలకు ఒక్కసారిగా మందుబాబులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లు కట్టారు. మద్యం ధరలు 25 శాతం పెంచారన్న సమాచారం ఉన్నప్పటికీ ఏది ఎంత? అన్న సమాచారం లేకపోవడంతో షాపులు ఓపెన్ చేసినప్పటికీ ధరలపై స్పష్టత లేకపోవడంతో దుకాణదారులు విక్రయించేందుకు మొగ్గు చూపలేదు.

దీంతో మందుబాబుల్లో అసహనం పెరిగిపోయింది. ఎట్టకేలకు మద్యం ధరలపై స్పష్టత రావడంతో దుకాణాల ముందు బోర్డులు పెట్టి విక్రయాలు ఆరంభించారు. దీంతో భారీ ఎత్తున విక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులు వైన్ షాప్స్ దగ్గర మద్యం ప్రియులను లైన్లలో నిలబెడుతూ బిజీగా మారిపోయారు. దీంతో ఏపీలోని మద్యం దుకాణాల వద్ద కోలాహలంగా మారింది.

Tags: liquor, ap, liquor sale, wine shopes,

Next Story

Most Viewed