రేవంత్‌రెడ్డి పోరాటం కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా !

by  |
రేవంత్‌రెడ్డి పోరాటం కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా !
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌, బీజేపీ దూకుడు మీదుండి కాంగ్రెస్ వెనకబడిందన్న ప్రచారం ఉన్నా.. ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీల్లో పాల్గొంటూ టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇన్నిరోజులు హైదరాబాద్‌కు టీఆర్ఎస్ మేయరే ఉన్నా చేసిందేమీ లేదని వివరిస్తూనే ఓట్ల కోసం పాకులాడుతున్న బీజేపీ, ఎంఐఎంను తూర్పారా పడుతున్నారు. గ్రేటర్‌‌ను డెవలప్‌ చేసిందీ కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు టీఆర్ఎస్ లేదా బీజేపీ మేయర్‌ పీఠం దక్కించుకున్నా ఏమీ చేయరని, తనకు ఓ పాతికమంది కార్పొరేటర్లను ఇస్తే.. కొట్లాడి మరి హైదరాబాద్‌ డెవలప్‌లో భాగస్వామ్యం అవుతానని ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠాన్ని గెలుచుకునేంత బలం లేదని ఓ అంచనాకు వచ్చిన రేవంత్‌.. బల్దియా చైర్‌ను గెలుచుకుంటామని పెద్ద పెద్ద మాటల జోలికి పోకుండా, కౌన్సిల్‌లో తనకు కొంతమంది సహకరాన్ని అందిస్తే.. పాలకులను నిలదీసి, అభివృద్ధి చేయిస్తానని పౌరుషమైన మాటలను గల్లీ లీడర్లకు నూరిపోస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్న నేను.. కౌన్సిల్‌కు వెళ్తే ఒక్కడినే మాట్లాడుతున్నానని, వాళ్లతో పోరాడేందుకు నాకు బలం సరిపోవట్లేదని విడమరిచి చెబుతూ గతంలో కంటే ఎక్కువ సీట్లను గెలిచేలా గ్రేటర్‌లో కాంగ్రెస్ తరపున ఒంటరి పోరాటం చేస్తున్నారు.

డివిజన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రచారం ఒకఎత్తు అయితే.. బీజేపీ, ఎంఐఎం గొడవపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు గ్రేటర్ ప్రజలను మరింత ఆలోచనలో పడేశాయి. ప్రతిరోజు రాత్రి బీజేపీ, ఎంఐఎం నేతలు ఫోన్‌లో మాట్లాడుకుంటారని, దీనికి అనుసంధాన కర్త కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అని రేవంత్ వ్యాఖ్యానించడంతో.. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి. ఎంపీలు బండి సంజయ్, అరవింద్.. అసదుద్దీన్, అక్బరుద్దీన్ బద్రర్స్‌ స్క్రిప్ట్ తయారు చేసుకొని మాట్లాడుతున్నారనడం గ్రేటర్‌ కాంగ్రెస్ ప్రచారంలో హైలైట్‌గా నిలిచింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్‌లను గౌరవించుకోలేని వాళ్లు.. పీవీ, ఎన్టీఆర్‌పై ప్రేమ ఒలకబోస్తున్నారని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ శ్రేణుల్లో బూస్ట్ నింపుతున్నారు.

మల్కాజిగిరికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రేవంత్‌.. నగరం మొత్తం ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం నేతలపై పదునైన వ్యాఖ్యలతో కొత్త ఓటర్లను తమవైపు తిప్పుకుంటూనే కాంగ్రెస్‌ క్యాడర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేవంత్ ఒంటరి పోరాటం కాంగ్రెస్‌కు పాత మైలేజ్ తీసుకువస్తుందా లేకుంటే, పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే.. పంచాయతీలు, కొట్లాటలతో మునుపటి లాగే ఉంటుందా అన్నది ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేయనున్నాయి.


Next Story

Most Viewed