ప్రైవేటు టీచర్లను విధుల్లోకి తీసుకుంటారా..?

by  |
Private-school-teachers
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలలు ప్రారంభమవుతున్నప్పటికీ ప్రైవేటు టీచర్లు ఉపాధికి నోచుకోవడం లేదు. యాజమాన్యాలు పూర్తిస్థాయి సిబ్బందిని విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులు బోధిస్తున్న టీచర్లను మాత్రమే విధుల్లోకి ఆహ్వానించడంతో దాదాపుగా 80శాతం మంది టీచర్లకు ఉపాధి లభించడం లేదు. ప్రైవేటు టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ట్యూషన్ ఫీజులను యాజమాన్యాలే నిర్ణయించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ప్రైవేటు టీచర్లకు పిలుపు రాలేదు

సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నప్పటికీ ప్రైవేటు టీచర్లకు యాజమాన్యాల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 12 వేల ప్రైవేటు స్కూళ్లలో దాదాపుగా 2.09 లక్షల మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి వీరిలో కేవలం 15 నుంచి 20శాతం మంది టీచర్లను మాత్రమే ఆన్‌లైన్ తరగతులు బోధించేందుకు యాజమన్యాలు విధుల్లోకి తీసుకున్నాయి. ఫిజికల్ తరగతులను ప్రారంభిస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా ఆన్‌లైన్ తరగతులను బోధించే టీచర్లను మాత్రమే యాజమాన్యాలు విధుల్లోకి తీసుకుంటున్నారు. గత ఏడాదిన్నరగా ఉపాధిని కోల్పోయిన 80శాతం మంది టీచర్లకు ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు. కుటుంభ పోషణ కోసం ఇప్పటికే 50శాతం మంది ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు.

ఆదేశాలు జారీ చేయలేమన్న ప్రభుత్వం

ప్రైవేటు టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాలకు ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ చేయలేమని ప్రభుత్వం నుంచి సమాధానాలు వస్తున్నాయి. కరోనా సమయంలో 4 నెలల పాటు నగదును, ఉచిత బియ్యాన్ని ఇచ్చి ఆదుకున్నామని ఇంతకంటే మించి ఏమి చేయలేమని ప్రభుత్వ పెద్దలు తెలుపుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మనవతా దృక్పథంతో తమ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ట్యూషన్ ఫీజు ఎంత అనే అంశాలను యాజమన్యాలే నిర్ణయించాలని స్పష్టం చేశారు. ఫీజులు వసూలు చేసేందుకు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తున్నారు. పాఠశాలలో ఎంత ఫీజును నిర్ణయించాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు.

ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి

ఏడాదిన్నరగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి. పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నప్పుడు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించాలి. ఇప్పటి వరకు ప్రైవేటు టీచర్లకు యాజమాన్యాల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేటు టీచర్లు ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలి.
-షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫెడరేషన్


Next Story

Most Viewed