‘పొంగులేటి’కి ఆ విషయం తేల్చి చెప్పిన క్యాడర్..?

by  |
‘పొంగులేటి’కి ఆ విషయం తేల్చి చెప్పిన క్యాడర్..?
X

దిశ, ఖమ్మం ప్రతినిది: అనూహ్య రాజకీయాలకు ఖమ్మం ఎప్పటికీ వేదికే. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ జిల్లా రాజకీయాల మీద ఓ కన్నేసి ఉంచుతాయి. ఇప్పుడు ఖమ్మంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఓ నేత గురించి చర్చ జరుగుతోంది. బడా కాంట్రాక్టర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి అనుచరగణం, అభిమానులున్న నేత. ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకప్పుడు జిల్లాలో తిరుగులేని నేతల్లో ఈయన ఒకరుగా ఉండేవారు. ఇప్పడు అధికార పార్టీలో ఉంటూ ఏ పదవీ లేక.. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనకున్న భారీ అనుచరగణం, అభిమానులు తమ నేత ఇలాంటి సంకట స్థితిలో ఉండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తన అనుచరుల అభిమతానికి అనుగుణంగానే పొంగులేటి సైతం ఇప్ప్పుడు టీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో బలమైన నేతగా ఉండి తనకు జరిగిన అవమానం వల్లే ఎలాంటి అధికారిక కార్యక్రమాలకూ హాజరు కావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాదు. టైం చూసి తమ నేత మంచి నిర్ణయం తీసుకుంటాడని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే మొన్న జరిగిన ఐటీహబ్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాలకు కూడా పొంగులేటి హాజరుకాకపోవడం, కార్యక్రమాల అనంతరం మంత్రి కేటీఆర్ స్వయంగా పొంగులేటిని హెలికాప్టర్లో తన వెంట తీసుకెళ్లే ఫొటో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితులనే ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా మలుచుకుని శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

‘హామీలు’ ఇచ్చి హ్యాండిచ్చిన గులాబీ బాస్..

పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న నేత. అభిమానులూ ఎక్కువే. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అంతేకాదు మరో మూడు అసెంబ్లీ స్థానాలనూ గెలిపించుకుని చరిష్మాను మరింత పెంచుకున్నారు. వైఎస్ జగన్ తో మంచి సంబంధాలు ఉండడం వల్ల వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన గెలిపించుకున్న ఎమ్మెల్యేలు సహా భారీగా ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ పొంగులేటి రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటామని, ఎంపీ సీటును కేటాయిస్తామని చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు పార్టీలో ప్రత్యేక స్థానాన్ని కూడా కల్పిస్తామని, పలు ‘హామీ’లు కూడా ఇచ్చినట్టు అప్పడు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. 2018లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కేటాయించకుండా అప్పటికీ ఇంకా టీఆర్ఎస్ లో చేరని నామా నాగేశ్వరరావును హడావుడిగా పార్టీలో చేర్చకుని మరీ టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయన అభిమానులు ఆత్మహత్యాయత్నాలు కూడా చేశారు. ఆ సమయంలో వారిని శ్రీనివాసరెడ్డి ఓదార్చి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ సముదాయించారు. ఆ సమయంలో కూడా కేసీఆర్ శ్రీనివాసరెడ్డికి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఖమ్మం ఎంపీని గెలిపిస్తే పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని, రాజ్యసభకు పంపిస్తామని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో అప్పడు నామా గెలుపు కోసం స్వయంగా పొంగులేటి కష్టపడ్డారు. పెద్ద ఎత్తున తన అనుచరుల్ని రంగంలోకి దించి ప్రచారం చేయించారు. ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో పొంగులేటి ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి మరీ పార్టీని గెలిపించుకున్నారు. రాజ్యసభ స్థానం కోసం ఎదురు చూసిన పొంగులేటికి, ఆయన అనుచరగణానికి మరోసారి హ్యాండిచ్చారు సీఎం కేసీఆర్. దీంతో ఆయన అభిమానుల్లో మరోసారి ఆగ్రహం పెల్లుబికింది. భారీ ఎత్తున ఆందోళన చేయగా వారిని పొంగులేటి సముదాయించారు. ఇక అప్పటి నుంచి పార్టీలో ఏ హోదాలేక పోవడంతో అసంతృప్తిగా ఉన్న పొంగులేటి, ఆయన అనుచరులు ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు.

బీజేపీ గాలం..?

పొంగులేటిని టీఆర్ఎస్ పక్కకు నెట్టడంతో కమలదళం పార్టీలోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ కల్పిస్తామని, తనతో పాటు జిల్లాలోని తన అనుచరులకు కూడా సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. అయితే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటితో పాటు మరో సీనియర్ నేత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ మారాలని, ఇదే సరైన సమయంగా భావించి మంచి నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తాను తీసుకున్న నిర్ణయం తీసుకున్నానని, సమయం చూసి అడుగేస్తానని పొంగులేటి అత్యంత సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.

మౌనానికి కారణమేమి..?

జిల్లాలో పార్టీ ప్రతిష్ట కోసం ఎంతో కృషి చేసి, అన్ని ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడ్డ తనను చివరకు పక్కకు పెట్టారని పలుమార్లు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. పార్టీలో జరిగిన అన్యాయానికి మౌనంగా ఉన్నాడే తప్ప పొంగులేటి ఎప్పడు కూడా అధిష్టానం మాట దాటలేదు. బహిరంగ నిరసన ఏనాడూ వ్యక్తం చేయలేదు. ఆందోళనలు చేయించలేదు.. మరి ఆయన మౌనానికి కారణాలు వేరే ఉన్నాయని, బడా కాంట్రాక్టర్ కాబట్టి ఆచితూచి అడుగేయాల్సి వస్తోందని శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితులు అంటున్నారు. అదనుచూసి తమ నేత టీఆర్ఎస్ ను వీడడం ఖాయమని వారు చెబుతున్నారు.

పొంగులేటిని కేటీఆర్ కలవడంపై జోరుగా పుకార్లు..

మొన్న ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పువ్వాడ అజయ్ కుమార్ హెలికాప్టర్ దిగగానే నేరుగా పొంగులేటి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుని కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. అయితే ఏ కార్యక్రమంలో కూడా శ్రీనివాసరెడ్డి పాల్గొనలేదు. పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయన్ను హెలికాప్టర్ లో తన వెంట తీసుకెళ్లారు. దీంతో జిల్లా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొంగులేటి సహా ఆయన వర్గీయులు బీజేపీ వైపు చూస్తున్నారనే.. కేటీఆర్ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. పార్టీ మారే నిర్ణయం తీసుకున్న తమ నేతను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే కలుస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బలమైన కేడర్ ఉన్న లీడర్ దారెటో చూడాలి మరి.

Next Story