హుజూరాబాద్ ఎఫెక్ట్.. జనంలోకి కేసీఆర్!

by  |
Chief Minister KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ పార్టీ విధానంలో, కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పులు చోటుచేసుకుంటాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ కేసీఆర్ కోరుకున్నవారికి మాత్రమే తెరుచుకునే ప్రగతి భవన్ గేట్లు ఇకపైన మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఓపెన్ కావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. జిల్లాల పర్యటనల పేరుతో కేసీఆర్ మళ్లీ జనం బాట పట్టే అవకాశముందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, కోట్లాది రూపాయలను దళితబంధు కోసం ఖర్చు చేసేలా ప్లాన్ చేసినా హుజూరాబాద్‌లో ఓటర్లు మాత్రం ఆదరించకపోవడంతో మళ్లీ వారిలో విశ్వాసాన్ని కల్పించడానికి ప్రజల మధ్యకు వెళ్లే అవకాశాలున్నాయి.

ఎలాగూ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసింది. జిల్లాల్లో పార్టీ ఆఫీసులు రెడీ అవుతున్నాయి. ఇకపై మండల స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలు వస్తాయని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్టీని బలోపేతం చేయడానికి ఇన్ని చర్యలు తీసుకుంటున్నా హుజూరాబాద్ ఫలితంతో బీజేపీ సైతం గ్రామాల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వీటిని అంచనా వేసుకుని ఇకపైన ప్రజల్లో మళ్లీ ధీమా కల్పించడానికి వివిధ రకాల పేర్లతో సభలు, సమావేశాల రూపంలో వారి చెంతకు వెళ్లే అవకాశం ఉన్నది. దళితబంధు ప్రభావాన్ని అంచనా వేసి ఆ పథకం గురించి మరింత నమ్మకం కలిగించడానికి ప్రతీ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉంది.

మొదటి ఐదేళ్లు ప్రగతి భవన్‌లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ఎంట్రీకి పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ఎప్పుడైనా వెళ్లి కేసీఆర్‌తో మాట్లాడే అవకాశం ఉండేది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ సాధ్యం. మంత్రులు సైతం ఇందుకు అతీతం కాదు. ఇప్పుడు హుజూరాబాద్ ఫలితంతో ఆ ఆంక్షల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. అసంతృప్తులు ఉన్నవారిని స్వయంగా ప్రగతి భవన్‌కు పిలిపించుకుని బుజ్జగించి చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాలూ మొదలవుతాయనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

ఒక్క హుజూరాబాద్ ఫలితం కేసీఆర్ వ్యవహారశైలిని, పార్టీ పనితీరులో మార్పులు తీసుకురావడం ఖాయమని, పార్టీని బతికించుకుని మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇవి పాటించక తప్పదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed