బియ్యం తీసుకోకున్నా రూ.1500 జమ చేస్తాం..

by  |
బియ్యం తీసుకోకున్నా రూ.1500 జమ చేస్తాం..
X

–రెండు మూడు రోజుల్లో రూ.1500 వస్తాయి
–తెలంగాణ పౌరసరఫరాల శాఖ

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది రేషన్ లబ్దిదారులకు ఈ నెల మొత్తం రేషన్ అందిస్తామని గతంలో లాగా 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ ఇచ్చే నిబంధనను ఎత్తి వేస్తున్నామని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం తీసుకుంటేనే రూ.1500 నగదు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని, బియ్యం తీసుకున్నా తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59లక్షల కుటుంబాలకు ఆన్‌లైన్ ద్వారా నగదు జమచేస్తామని చెప్పారు. దీనికి అవసరమైన కసరత్తును అధికారులు ఇప్పటికే పూర్తిచేశారన్నారు. బియ్యం పంపిణీ విషయమై శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని పౌరసరఫరా సంస్థ కార్యాలయంలో శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 12 కిలోల బియ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి లబ్దిదారునికి బియ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన 3.34లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపుల్లో నిల్వ ఉంచామని ఆయన చెప్పారు. రేషన్ షాపులు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంటాయన్నారు. కూపన్ తీసుకున్న వారు మాత్రమే బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుల వద్దకు రావాలని సూచించారు. ఎన్నడూ లేని విధంగా ఈ నెల 1,2 తేదీల్లో రికార్డు స్థాయిలో 14లక్షల కార్డుదారులు 55వేల561 మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకున్నారని, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో 4 లక్షల మంది రేషన్ తీసుకున్నారని తెలిపారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని వితరణ్ పోర్టల్‌లలో రేషన్ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయవలసి వస్తోందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని నిబంధనలను సడలించిందని చెప్పారు. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకునే సదుపాయం కల్పించిందని, పోర్టబులిటీ ద్వారా రేషన్ తీసుకునే వారు మాత్రం వేలిముద్ర వేసి బియ్యం తీసుకోవాలన్నారు.

Tags : pds, rice, cash transfer, civil supplies chairman, telangana



Next Story

Most Viewed