బాల్క సుమన్‌ ఈజ్ బ్యాక్.. నిజమా?

by  |
బాల్క సుమన్‌ ఈజ్ బ్యాక్.. నిజమా?
X

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ రాష్ట్రవ్యాప్తంగా కొత్తచర్చకు దారితీసింది.
అసెంబ్లీ ఎన్నికల వరకూ కేసీఆర్‌కు ప్రియశిష్యునిగా, కేటీఆర్‌కు సన్నిహిత అనుచరుడిగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ యూత్ లీడర్ ఈ మధ్య కనిపించడంలేదనే గుసగుసలు వ్యాపించాయి. ప్రతిపక్షాలను వాడిగా, వేడిగా తిట్టే ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ కనిపించే సుమన్‌కు గత కొంతకాలం నుంచి ప్రాధాన్యం తగ్గడం, నియోజకవర్గానికే పరిమితం కావడం వెనుక మతలబు అర్థం కాక రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది..?

ఉద్యమ సమయంలో ప్రయారిటీ..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బాల్క సుమన్ ఒక వెలుగు వెలిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దృష్టిలో పడ్డారు. అప్పుడు ఆయన కేవలం ఒక విద్యార్థి నాయకుడు. అదే ఆయనకు ఎంపీ టికెట్ తెచ్చిపెట్టింది. సెంటిమెంట్ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీగా కూడా గెలిచారు. లోక్‌సభకు ఎన్నికైన అతి కొద్దిమంది తక్కువ వయసు కలిగిన ఎంపీల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. యువ ఎంపీగా కేటీఆర్‌కు బాగా సన్నిహితుతులయ్యారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరుగా మారిపోయారు. ప్రగతి భవన్‌‌లోకి ఎనీ టైమ్ ఎంట్రీ. ఢిల్లీలోని కేసీఆర్ బంగళాలోలోనూ ఇలాంటి స్వేచ్ఛ లభించింది. కేసీఆర్ కుటుంబంతో అంతటి చనువు సంపాదించుకున్నారు. చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోయాయి. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కానీ కారణాలేవో బాహ్య ప్రపంచానికి తెలియదుగానీ ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ కరువైంది. సందర్భమేదైనా కేటీఆర్‌తో కలిసి వేదికను పంచుకునే అవకాశాలు తగ్గిపోయాయి. తెలంగాణభవన్‌లో రోజువారీ జరిగే ప్రెస్‌మీట్‌లలో కనిపించడం తగ్గిపోయింది.

‘కౌంటర్’ స్పెషలిస్టు..

ఎంపీగా ఉన్నప్పటి ప్రాధాన్యం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు తగ్గిపోయింది? పార్టీ అగ్రనేతలకు ఎందుకు ఆగ్రహం వచ్చింది? ఎందుకు పక్కన పెట్టారు? అంటీ ముట్టనట్లుగా ఎందుకు మారిపోవాల్సి వచ్చింది? కేవలం నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారు? అప్పటిదాకా టీఆర్ఎస్‌ పార్టీనిగానీ, కేసీఆర్, కేటీఆర్ లాంటి నేతలనుగానీ ఎవరైనా విమర్శిస్తే వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చేవారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఏ చిన్న విమర్శనైనా తిప్పికొట్టడానికి ముందుండేవారు. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. టీఆర్ఎస్ పార్టీలో చాలా మందికి ఈ విషయం అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం ఆయనకూ అలవాటైపోయింది.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్న తర్వాత గోదావరి నదీ తీరం వెంట వందలాది కిలోమీటర్ల పొడవునా ఆయిల్ పామ్ సాగుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారు. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ పంట పండించే రైతులతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. లోతుగా అధ్యయనం చేయడానికి కమిటీ ఆలోచన కూడా జరిగింది. ఆ కమిటీలో బాల్క సుమన్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పాలనీ అనుకున్నారు. ఈ లోగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. చెన్నూరు నుంచి సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నియోజకవర్గానికే పరిమితం..

ఆ తర్వాత నుంచి బాల్క సుమన్ తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. స్వంత చొరవతోనే ఖమ్మం జిల్లా అశ్వారావుపేట లాంటి ప్రాంతాల్లో జోరుగా సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. చెన్నూరు నియోజకవర్గంలో సైతం వాటి సాగుపై దృష్టి పెట్టారు. దీంతోపాటు నియోజకవర్గంలోని జాతీయ రహదారులు, మిషన్ భగీరథ అమలు, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి… లాంటి అంశాలకు పరిమితమయ్యారు. జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనడం, పట్టణ ప్రగతి, ప్రారంభోత్సవాలు తదితరాలకే పరిమితమయ్యారు.
హఠాత్తుగా రేవంత్‌రెడ్డి లేవనెత్తిన అంశాలకు కౌంటర్ ఇవ్వడానికి ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టడంతో సుమన్ మళ్లీ ఒకసారి ఫోకస్ లోకి వచ్చారు. ఇకనైనా కేసీఆర్, కేటీఆర్ ఆయనను చేరదీస్తారా? తగిన ప్రాధాన్యం కల్పిస్తారా? చూడాలి.

Tags: TRS, Balka Suman, Fire brand, Chennur MLA, KTR, KCR, Pragathi Bhavan, Telangana bhavan

Next Story

Most Viewed