నోముల కుటుంబం’ కథ కంచికేనా.. హామీ ఇచ్చి ఆగం చేసిన పెద్దసారు?

807

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆయన దివంగత ఎమ్మెల్యే. దాదాపు 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఉద్యమాలు.. మరెన్నో పోరాటాలు చేశారు. కమ్యూనిస్టు నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి.. 2014 ఎన్నికలకు ముందు ఉద్యమ పార్టీలో చేరారు. స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో స్వల్ప ఓటమిని చవిచూశారు. అయినా వెనుతిరక్కుండా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఓవైపు ప్రజాసమస్యలపై ఉద్యమిస్తూనే.. మరోవైపు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గంతో పోరాడారు. అనారోగ్య సమస్యలతో గతేడాది డిసెంబరులో కన్నుమూశారు. ఆయన మరెవరో కాదు నాగార్జునసాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య. కానీ ప్రస్తుతం నర్సింహాయ్య కుటుంబం రాజకీయ ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఉపఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య కుటుంబానికి టికెట్ దక్కుతుందని అంతా భావించారు. కానీ టీఆర్ఎస్‌లో నెలకొన్న వర్గపోరుతో ఆ కుటుంబం రోజురోజూకీ మరుగున పడే ప్రమాదంలోకి చేరుతోంది. నాన్‌లోకల్ పేరుతో నోముల కుటుంబాన్ని సాగర్ నియోజకవర్గానికి దూరం చేసేందుకు కొంతమంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సొంత పార్టీ శ్రేణులే సందిగ్ధంలో పడుతున్నాయి. ఈ క్రమంలో నోముల నర్సింహాయ్య కుటుంబానికి ఉపఎన్నికలో టికెట్ దక్కడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయనడంలో ఏలాంటి సందేహం లేదు.

వర్గపోరుతో అసలుకే మోసం..

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలకు పెద్దపీట వేసినట్టయ్యింది. గెలుపు సంగతి పక్కనపెడితే.. అసలు టికెట్ దక్కే విషయంలోనే పోటీ ఉత్కంఠను రేపుతోంది. ఉపఎన్నిక టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య కుటుంబానికి ఇవ్వడం సబబు అని కొంతమంది సొంత పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరికొంతమంది పార్టీ శ్రేణులు మాత్రం ఈసారైనా టికెట్‌ను నాన్‌లోకల్ వ్యక్తులకు కాకుండా లోకల్ వారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే లోకల్ వ్యక్తితో పాటు ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిగా పేరు విన్పిస్తోన్న జానారెడ్డిని ఎదుర్కొవాలంటే.. జనబలంతో పాటు ఆర్థికంగా బలం ఉంటేనే గెలుపు దిశగా వెళ్లే అవకాశం ఉంటుందని, అందుకు సెంటిమెంట్ కంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని మరో వర్గం వాదిస్తోంది. ఈ వాదనలు ఏలా ఉన్నా.. వాటి వెనుక ప్రయోజనం మాత్రం వర్గపోరు అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే నోముల కుటుంబానికి రోజురోజూకీ ప్రాధాన్యత తగ్గుతోందనే భావన టీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.

ఎవ్వరికీ వారు ప్రచారం..

ఉపఎన్నిక టికెట్ అభ్యర్థిత్వం ఎవరికనేది ఖరారు కాకముందే టీఆర్ఎస్ నేతలు ఎవ్వరికీ వారు ప్రజల్లోకి వెళుతున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. టికెట్ రేసులో ప్రధానంగా ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాద్, బడుగుల లింగయ్యయాదవ్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ప్రచార రేసులో నోముల నర్సింహాయ్య కొడుకు నోముల భగత్ కాస్తంత వెనుకబడినట్టే కన్పిస్తోంది. భగత్‌కు క్షేత్రస్థాయిలో సహకరించే వారు లేకపోవడం.. అదే సమయంలో పార్టీ అధిష్టానం నుంచి అండగా నిలిచేందుకు పెద్ద దిక్కు లేకపోవడమూ సమస్యగా మారిందనే చెప్పాలి. దీంతో అసలు నోముల నర్సింహాయ్య కుటుంబానికి టికెట్ దక్కడం లేదని సొంత పార్టీ నేతలో ప్రచారం చేస్తుండడం కొసమెరుపు.

విస్తృత ప్రచారంలో దూదిమెట్ల..

నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నోముల నర్సింహాయ్య బంధువు, తెలంగాణ ఉద్యమకారుడు దూదిమెట్ల బాలరాజుయాదవ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సాగర్ నియోజకవర్గంలో దాదాపు సగానికి పైగా ప్రచారాన్ని కంప్లీట్ చేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందడం.. టీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉండడం.. నోముల నర్సింహాయ్య దగ్గరి బంధువు కావడం.. దూదిమెట్లకు కలిసోస్తాయని మరో వర్గం ప్రచారం చేస్తోంది. ఉద్యమ సమయంలో ఏపీఎన్‌జీఓల సభను అడ్డుకోవడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. దీంతో ఉపఎన్నిక టికెట్‌ను దూదిమెట్ల బాలరాజుయాదవ్‌కు ఇస్తే.. టీఆర్ఎస్‌ ఆశించిన ఫలితం ఉండే అవకాశం లేకపోలేదనే చెప్పాలి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..