వరద సాయం ముంచేనా.. తేల్చేనా..?!

by  |
వరద సాయం ముంచేనా.. తేల్చేనా..?!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ శాతం ఈ సారి ఆసక్తికరంగా మారింది. ముంపు ప్రాంతాల్లో సాయం అందలేదని బాధితులు ఆందోళనకు దిగారు. నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలే పంచుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా డివిజన్లలో ఓటింగ్ శాతాలను గమనిస్తే చివరి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే భారీగానే తగ్గినట్టు కనిపిస్తోంది. ఏ పార్టీ వచ్చినా తమకొరిగిందేమీ లేదనే అభిప్రాయంతో ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

ఉప్పల్, నాగోల్ వంటి ప్రాంతాల్లో పెరిగినట్టు తెలుస్తోంది. చిలకానగర్, రామంతాపూర్, మల్లాపూర్ ప్రాంతాల్లో వరదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ వరద సాయం పంపిణీ కూడా జరిగింది. రాజకీయంగా టీఆర్ఎస్‌కు ఇది ఉపయోగపడుతుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే 2016 నాటితో పోలిస్తే ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గిపోయింది. వరదల సమయంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఓటింగ్‌లో భిన్న రకాలుగా తీర్పులనిస్తున్న డివిజన్ల ప్రజలు ఎవరికి తమ మద్దతును ప్రకటిస్తారో మరో రెండు రోజుల్లో తేలనుంది.

ఇక మన్సూరాబాద్, హయత్ నగర్, టోలిచౌకీ, సరూర్ నగర్ వంటి ఏరియాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక్కడ ఓటింగ్ శాతంలో 3-10 శాతం వరకూ పెరుగుదల కనిపించింది. వరద సాయం డబ్బులు అందని వారు ప్రభుత్వానికి ఓటేసేందుకు అధికంగా వచ్చారా.. లేక సాయం తీసుకున్నందుకు అధికార పార్టీకి ఓటేసి విశ్వాసం ప్రకటించారా అనేది ఫలితాల తర్వాతే తేలేది. అయితే ముంపు డివిజన్లలో ఓటర్లు ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా తీర్పునిచ్చారు. ఓటింగ్ శాతాల్లో వచ్చిన మార్పులు టీఆర్ఎస్‌కు అనుకూలిస్తాయా లేక తమను గెలిపిస్తాయోననే మేధోమదనంలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి.



Next Story

Most Viewed