మాజీ మంత్రి హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉంది

by Disha Web Desk 15 |
మాజీ మంత్రి హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉంది
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత గాదగోని చక్రధర్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రంగనాయక సాగర్ లో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు భూ కబ్జా, అక్రమాలను బయట పెట్టిన తనకు ఏ హాని జరిగినా హరీష్ రావే కారణమన్నారు. సిద్దిపేటలోని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైశ్యులు, వ్యాపారస్తులు, తన ఫోన్ తో పాటుగా, తన భార్య, తన ఇంట్లో పని చేసే వ్యక్తి ఫోన్లను గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు ట్యాప్ చేయించారని ఆరోపించారు.

సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తా అన్నారు. అదే విధంగా హరీష్ రావు మామ హన్మంతరావు కొండపాక మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని ఆరోపించారు. సిద్దిపేట నియోజక వర్గంలో అభివృద్ధి పేరిట దోపిడీ జరిగిందన్నారు. రంగనాయక సాగర్ నిర్వహణ పేరిట డబ్బులు కాజేశారన్నారు. ఈ విషయాలన్నింటినీ నివేదిక రూపంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులతో తనను వేధించిన హరీష్ రావు భూకబ్జా, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో శిక్ష అనుభవించక తప్పదన్నారు.

Next Story

Most Viewed