ఆగిన చేనేత మగ్గం

by  |
ఆగిన చేనేత మగ్గం
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచమంతా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న తరుణంలో మన కట్టు, బొట్టులో అనేక మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్కెట్‌లో చలామణిలో ఉన్న రకరకాల ట్రెండ్స్.. ఫ్యాషన్ ప్రపంచాన్ని కొత్తగా ప్రజెంట్ చేస్తు్న్నాయి. అయితే ఏ ఫ్యాషన్ అయినా ఎక్కువ రోజులు ట్రెండింగ్‌లో ఉండదు. దానికన్నా మించినదేదో రాగానే.. అప్పటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్ అవుట్‌డేట్ అయిపోతుందన్నది నిజం. ఎందుకంటే పైపై మెరుగులన్నీ ఇన్‌స్టంట్‌గానే కిక్కిస్తాయి. అంతలోనే కనుమరుగైపోతాయి. మరి ఏది శాశ్వతం? అంటే.. క్లాస్ ఒక్కటే శాశ్వతం. ఆ క్లాసిక్ లుక్‌నిచ్చేవి చేనేత వస్త్రాలే. ఫ్యాషన్ హోరులో భారీ కుదుపునకు గురైన చేనేత రంగానికి ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో వచ్చిపడ్డ కరోనా లాక్‌డౌన్ చేనేత బతుకులపై గుదిబండను మోపింది.

చేనేత వస్త్రాల్లో అగ్రభాగాన నిలిచేవి చీరలే. అంతెందుకు భారతీయ సంప్రదాయాన్ని ద్విగుణీకరించేవి చీరలే అన్న విషయం తెలిసిందే. ఇక వెండితెరపై ఎందరో హీరోయిన్లు తమ చీర కట్టు స్టైల్‌తో ఆ చీరలకే అందాన్ని తెచ్చిపెట్టారు. అలనాటి తార ‘సావిత్రి’ ఈ విషయంలో ముందువరసలో ఉంటారు. ఇటీవలే ఆమె బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్‌ ధరించిన కాస్ట్యూమ్స్‌కు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఆ సినిమాలో కీర్తి చేనేత వస్త్రాలే ధరించడం గమనార్హం. బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన ‘దేవదాసు’ సినిమాలోనూ తెలంగాణ చేనేత కళాకృతులు పరిఢవిల్లాయి. ఐశ్వర్యరాయ్‌, మాధురీ దీక్షిత్‌ ధరించిన వస్ర్తాల్లో చాలా వరకు ఇక్కడివే. ముంబయిలో ప్రతి ఏటా లాక్మే ఫ్యాషన్‌ షోల్లో మోడల్స్.. తమ ర్యాంప్ వాక్‌తో ఆహుతులను అలరిస్తుంటారు. వారి ఫ్యాషన్‌ డిజైనర్లకు అవార్డులు దక్కుతాయి. ఆ అవార్డులే వారి బిజినెస్‌కు ప్రచారాస్త్రాలవుతున్నాయి. కొందరు వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు. కానీ ఆ నటీమణులు కట్టిన చీరలు నేసిన చేతులిప్పుడు ఖాళీగా కూర్చున్నాయి. ఆ ర్యాంప్ వాకింగ్‌ చేసిన అతివలు ఒంటిపై ధరించిన వలువలకు అచ్చెరువులద్దిన చేతులిప్పుడు పనులు అడుగుతున్నాయి. వ్యాపారవేత్తలెవరూ కార్మికుల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పనుల్లేక వారి మనుగడ ప్రశ్నార్ధకమైంది.

ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్‌-2015కు హాజరైన 60 మంది విదేశీ ప్రతినిధులకు ప్రధాని నరేంద్రమోడీ చేనేత వస్ర్తాలను బహుకరించారు. ఆ విభిన్న వస్ర్తాలన్నీ తెలంగాణ ఉత్పత్తులే. ఇవన్నీ తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకంగా గుర్తింపునిచ్చిన ఇక్కత్‌, దూప్యాన్‌ సిల్క్‌ రకాలే కావడం గమనార్హం. మోదీ మెచ్చిన వస్ర్తాలు, రాష్ర్టానికి వచ్చే అతిథులకు సీఎం కేసీఆర్‌ బహుకరించే వస్ర్తాలన్నీ ఇక్కడి వారివే. ప్రజాప్రతినిధులందరికీ ఈ విషయం తెలుసు. ఇప్పుడా కార్మికవర్గమంతా కష్టాల కడలిలో మునిగిపోతున్నదని తెలుసు. కానీ ఆపన్నహస్తం అందించేందుకు మాత్రం వారికి చేతులు రావడం లేదు.

పేరుకుపోయిన రూ.200 కోట్ల వస్త్ర నిల్వలు

రాష్ట్రంలో రూ. 200 కోట్ల విలువ గల చేనేత నిల్వలు పేరుకుపోయాయి. కొనేవారు, నేయించే వారు లేక మగ్గాల శబ్ధం ఆగిపోయింది. రాట్నం తిరగనంటోంది. ఆసులన్నీ అటకెక్కాయి. కండెలన్నీ దారంతో ఎండిపోయాయి. రంగులద్దే పాత్రలన్నీ వెలిసిపోతున్నాయి. సట్టర్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ప్రతి చేనేత కార్మికుడి ఇంట ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. షావుకార్లు పని చెప్పడం లేదు. నేసిన చీరలను సేట్లు కొనడం లేదు. చేసే ఓపిక ఉంది. కొత్త డిజైన్లు రూపొందించగల నైపుణ్యం ఉంది. కానీ వరుస సంక్షోభాలు చేనేత రంగంపై పంజా విసురుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్‌డౌన్‌.. ఇలా వరుస విపత్తులతో చేనేత రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ రాష్ట్ర చేనేత అధ్యయన, విధాన కేంద్రం వంటి సంస్థలు చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు అవిరాళంగా కృషి చేస్తున్నాయి. ఊరూరా తిరిగి భరోసానిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ అధికారులెవరూ ఇప్పటి వరకు ఏ ఊరిలో ఏ మేరకు వస్త్ర నిల్వలు ఉన్నాయో కూడా లెక్కలు తీయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా కులవృత్తుల వారిలా చేనేత కార్మికులు ఇతర పనులు చేయలేరు. పైగా వారికి ఎలాంటి భూములూ ఉండవు. కూలీనాలీకి వెళ్లలేరు. ఇంట్లో ఉంటూ వారిలోని కళాతృష్ణతో ఉత్పత్తులను సాధించడమే తెలుసు. కానీ రెండు నెలల లాక్‌డౌన్‌తో వేలాది చేనేత కుటుంబాలకు పని కరువైంది. ఉత్పత్తులన్నీ బీరువాల్లో మగ్గుతున్నాయి. మాస్టర్‌ వీవర్లు చేతులెత్తేశారు. ప్రధానంగా నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల్లో చేనేత రంగం కుదేలయ్యింది. అప్పులు ఇచ్చినోళ్లు కట్టమంటున్నారు. ‘జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో గంజినీళ్లతో సరిపెట్టుకుంటున్న చేనేత కార్మికులు.. ‘ప్రభుత్వమా స్పందించు, నాయనా.. మేం మగ్గం పని తప్ప మరేం చేయలేం. కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఆదుకోండి’ అంటూ సోషల్‌ మీడియాలో పెడుతున్న ఫోటోలు వేలాది మంది కంట నీళ్లు తెప్పించాయి. పాలకులు స్పందించకపోయినా బాధ్యత కలిగిన సమాజమే పేరుకుపోయిన వస్ర్తాల కొనుగోలుకు పూనుకోవాలి.

విభిన్న వస్ర్తోత్పత్తికి కేంద్రంగా తెలంగాణ

నల్లగొండ, వరంగల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇక్కత్‌, ఉప్పాడ, జమ్దానీ, కంచి, రాజ్‌కోట్‌(గుజరాత్‌ నమూనా), ఇక్కత్‌లో కోటా(రాజస్థాన్‌ డిజైన్లు) రకాల చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. రూ. 5 వేలు మొదలుకొని రూ.3 లక్షల దాకా పలికే చీరలను నేసే కార్మికులు ఉన్నారు. నల్లగొండ, సిరిసిల్ల జిల్లాలో కొందరు ఔత్సాహిక మాస్టర్‌ వీవర్లు లెనిన్‌తో ప్రయోగాలు చేశారు. లినెన్‌/లినెన్‌, లినెన్‌/కాటన్‌, లినెన్‌/సిల్క్‌తో చీరలను నేయిస్తున్నారు. కళాంకారి కాటన్‌ చీరలను వెజిటెబుల్‌ కలర్స్‌తో ఉత్పత్తి చేస్తున్నారు. సిల్క్‌ మాదిరిగానే వీటిల్లోనూ చేతితో డిజైన్లను అల్లిస్తున్నారు. ఉప్పాడ, కంచిలో ఇక్కత్‌, సిల్క్‌/దూప్యాన్‌, సిల్క్‌/లినెన్‌, లినెన్‌/లినెన్‌, లినెన్‌/కాటన్‌ వంటి అనేక రకాల చీరలను నేశారు. రూ.4 వేల నుంచి రూ.2 లక్షల ఖరీదైన చీరలను ఉత్పత్తి చేశారు. సరికొత్త ‘వాన్‌ ట్విల్‌వీవ్‌’ చీరలను ఉత్పత్తి చేసిన నల్లగొండ జిల్లా చండూరు కార్మికుల కళ అంతాఇంతా కాదు. ట్విల్‌వీవ్‌ అంటే నేసేటప్పుడు నాలుగు పోగులకు ఒకటి పైకి, కిందికి మూడు వంతున విడిపోతాయి. దానికి పేకను అల్లుతూ అనుకున్న డిజైన్‌ వచ్చేటట్లుగా రూపొందించేది. మగ్గం మీద మూడు జకాట్లు(బార్డర్‌, చీర, కొంగులకు వేర్వేరు డిజైన్లు వచ్చేటట్లుగా) ఏర్పాటు చేశారు. ఇక్కత్‌, జాకాట్‌, కంచి బార్డర్‌తో కూడిన ఈ చీరలకు డిమాండ్‌ ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడా నిల్వలు కూడా ఏడ్పిస్తున్నాయి. ఇలాంటి నైపుణ్యం కలిగిన కళాకారులకు కూడా పనుల్లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.

షాపింగ్‌ చేద్దాం.. ఆదరిద్దాం

– గద్వాల పోదాం.. బెంగుళూరు చీర కొందాం. కొందరు వ్యాపారులు బెంగుళూరు, కోయంబత్తూరు, దొడ్లబల్లాపూర్‌, బుచ్చిరెడ్డిపాలెం నుంచి పవర్‌లూమ్ చీరలు తీసుకొచ్చి చేనేత చీరలుగా విక్రయిస్తున్నారు. ఇలా ఏటా రూ. 250 కోట్ల వ్యాపారం సాగుతోంది. కానీ నిఖార్సైన బెంగళూరు చేనేత చీరలను కొనేందుకు గద్వాల వరకు వెళ్తే సరిపోతుంది.
– ఇక్కత్‌ చీరలు, వస్ర్తాలకు పోచంపల్లి, పుట్టపాక, చండూరు, గట్టుప్పల, జనగాం, ఆలేరు, కొయ్యలగూడెం, చౌటుప్పల, ఎస్‌.లింగోటం, కుంట్లగూడెం, సంస్థాన్‌నారాయణపురం, ఆమనగల్లు తదితర గ్రామాలకు వెళ్లాలి.
– లుంగీలు, తువ్వాలల కోసం గుండాల, మోత్కూరు, ఆలంపూర్‌ ప్రాంతాలకు వెళ్లాలి.
– గద్వాల చీరల కోసం గద్వాల, కొత్తకోట, ఐజ, ఎక్లాస్‌పూర్‌ గ్రామాలకు వెళ్లొచ్చు.
– నారాయణపేట చీరలకు నారాయణపేట, గొల్లబాట చీరలకు సిద్ధిపేటలకు వెళ్లాలి.
– లినెన్‌ వస్ర్తాలకు దుబ్బాక ఫేమస్‌
– కాటన్‌ డ్రెస్‌ మెటీరియల్‌, బెడ్‌షీట్లకు హుజురాబాద్‌, కొత్తపల్లి, జమ్మికుంటలకు వెళ్లాలి.
– కార్పెట్ల కోసం వరంగల్‌ జిల్లాకు వెళ్లాల్సిందే.
నోట్‌ : గ్రామాలకు వెళ్తే ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయొచ్చు. దాని ద్వారా షోరూంల కంటే 40 నుంచి 50 శాతం తక్కువ ధరలకే వస్ర్తాలు కొనుగోలు చేయొచ్చు.

నిర్వీర్యం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆప్కోను టెస్కోగా మార్చారు. అవినీతి రాజ్యమేలింది. సహకార సంఘాలేవీ మనుగడ సాధించలేకపోతున్నాయి. ఆ తర్వాత తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థను ప్రకటించారు. రెండున్నరేళ్లయ్యింది. సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఎందుకో ఆ సంస్థను ఆచరణలో చూపించలేదు. పైగా సహకార సంస్థల పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండేండ్లయ్యింది. కానీ ఎన్నికల్లేవు. మరో వైపు టెస్కోకు ప్రత్యామ్నాయంగా ప్రకటించిన అభివృద్ధి సంస్థ కూడా రాలేదు. స్వరాష్ట్రంలో టెస్కోకు పాలకవర్గమూ లేదు. టెస్కోలో ప్రైవేటు డిజైనర్ల మీదున్న నమ్మకం అసలైన కళాకారులు, కార్మికులపై లేదు. సంఘాలనేమో దూరం పెట్టారు. కానీ పదవీ విరమణ పొందిన వ్యక్తులనేమో పెద్ద కుర్చీల్లో కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. వారి మాటే చెల్లుబాటవుతుండడం గమనార్హం. ఎంత పెద్ద కష్టమొచ్చినా చేనేత బ్రాండ్‌ అంబాసిడర్లు, టెస్కో నమ్ముకున్న ఫ్యాషన్‌ డిజైనర్లు మాత్రం స్పందించడం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్లు రంగంలోకి దిగిన చేనేత వస్త్ర నిల్వలు అమ్ముడుపోయేటట్లు చేయొచ్చు. కానీ ఆ ఊసే లేదు.

ప్రచార ఆర్భాటం

కేటీఆర్‌ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రచార ఆర్భాటం అంతాఇంతా కాదు. దాన్ని అందుకునే శక్తిసామర్ధ్యాలు టెస్కోకు ఇవ్వలేదు. ఓవెన్‌ 2017 సమంత ఫ్యాషన్‌ షో, 2018లో బీబీ రసూల్‌, 2019లో రీనాసింగ్‌ల ఫ్యాషన్‌ షోలతో ప్రభుత్వానికి, కొందరికి వ్యక్తిగతంగా పేరొచ్చింది. కానీ టెస్కోకు, చేనేత కళాకారులకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎంత మేలు జరిగిందో పాలకులే చెప్పాలి. పైగా టెస్కో ద్వారా ఫ్యాషన్‌ షోలు నిర్వహిస్తే అరువు బట్టలే తెచ్చారు. ఆఖరికి ఇటీవల ప్రభుత్వం తరపున ముంబయిలో లాక్మే ఫ్యాషన్‌ షోలో ప్రదర్శించిన వస్ర్తాలు కూడా ప్రైవేటు వ్యాపారులు, కళాకారులవేనన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలే ధరించాలన్న మంత్రి కేటీఆర్‌ పిలుపు కొంత ఫలితానిచ్చింది. కానీ ఎంతో కాలం నిలువలేదు. సింథటిక్‌ వస్త్రాల కంటే చేనేత వస్ర్తాలెంత మేలోనన్న వాస్తవాలను ప్రచారాస్త్రంగా వాడుకోలేదు. మెరుగైన నమూనాల రూపకల్పనలో టెస్కో విఫలమైందని చేనేత రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.

చేనేత అధ్యయన వేదిక డిమాండ్లు

– చేనేత వస్ర్తాలను సింగిల్‌విండో విధానంలో కొనుగోలు చేయాలి.
– రూ.1000 కోట్లు కేటాయించి చేనేతల మార్కెటింగ్‌కు బాటలు వేయాలి. నామమాత్రపు లాభాలను జోడించి విక్రయించడం ద్వారా వస్ర్తాలకు గిరాకీ పెరుగుతుంది. దాని కోసం జియోట్యాగ్‌ ఆధారిత బ్రాండింగ్‌ చేయాలి.
– ఒరిజినల్‌ చేనేత వస్ర్తాలు పొందలేక వినియోగదారులు మోసపోతున్నారు. పోచంపల్లి, గద్వాల డిజైన్‌ ఇమిటేషన్‌ వస్ర్తాలను చేనేత వస్ర్తాలుగా నమ్మించి దగా చేస్తున్నారు. అలాంటి వాటిని అరికట్టాలి.
– చేనేత కార్మిక కుటుంబాలు బతకడానికి నెలకు రూ.5 వేల వంతున కనీసం ఆర్నెళ్లు ఇవ్వాలి.
– పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలి.
– తెలంగాణ చేనేత వస్ర్తాలకు శాశ్వత మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు కావాలి.

ఇండస్ట్రీ ఆగమైంది: పద్మశ్రీ గజం అంజయ్య, మాస్టర్‌ వీవర్‌, పుట్టపాక

వరుస సంక్షోభాలతో హ్యాండ్లూం ఇండస్ట్రీ ఆగమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటేనే ఊపిరిపోసుకుంటది. లేకపోతే మనుగడ కష్టమే. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, పవర్‌లూంలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. చేనేత, పవర్‌లూమ్ వస్ర్తాలకు వేర్వేరుగా ప్రొక్యూర్‌మెంట్‌ చేయాలి. వినియోగదారులకు కన్యూజన్‌ లేకుండా చేనేత వస్ర్తాలకు ప్రచారం కల్పించాలి. కార్పొరేషన్‌ ద్వారా ఉత్పత్తి చేయించాలి. ప్రొడక్షన్‌ ధరకే వినియోగదారుడికి అందించాలి. అప్పుడే మనుగడ సాధ్యం. హైకో వంటి సంస్థల విధానాలే మార్గదర్శకాలు. ఆప్కో, టెస్కోల విధానాలతో అవినీతి పెరిగిపోయింది. దాంతో కార్మికులకు అన్యాయం జరిగింది. నకిలీలను ప్రోత్సహించారు. ఇక్కత్‌ వంటి వస్ర్తాలను పవర్‌లూమ్‌లో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి దించారు. దాంతో కార్మికుల పనికి విలువ లేకుండా పోయింది. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విధానాలను రూపొందించాలి. ఇదే విషయంపై లేఖలు కూడా రాశాను. ఇండస్ట్రీలో అన్ని వర్గాలతో చర్చించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని అమలు చేయడం ద్వారా చేనేత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.

కార్పొరేషన్‌ ద్వారా న్యాయం: యర్రమాద వెంకన్న నేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త

చేనేతకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. రూ.1000 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ పేరుకుపోయిన వస్ర్తాలను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చి చేనేత కుటుంబాలకు భరోసానివ్వాలి. షోరూం కంటే, వ్యాపారుల కంటే కార్మికులు, కళాకారుల ఇండ్ల దగ్గర కొనుగోలు చేయడం ద్వారా 40 నుంచి 50 శాతం డబ్బును ఆదా చేయొచ్చు. మేం ఇదే విషయాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాం. ఐతే మాపై కొందరు వ్యాపారులు నష్టపోతున్నామంటూ లడాయికి వస్తున్నారు. ప్రభుత్వం త్రిఫ్టు ఫండ్‌ తీసుకోవచ్చునంటే పాత బకాయిల కింద పెట్టుకునేందుకు కొందరు బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆ సాయం కూడా కార్మికుడికి ప్రస్తుత తరుణంలో అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణలో అనేక రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. సెలబ్రిటీలు, నటులు, అధికారులు, ప్రజాప్రతినిధులు చేనేత వస్త్ర ప్రచారాన్ని భుజాన వేసుకోవాలి.

నన్ను నమ్మి 100 మంది ఉన్నరు: చిలుకూరు శ్రీనివాస్, మాస్టర్ వీవర్, చండూరు, నల్లగొండ జిల్లా

అంతా గందరగోళం. వెయ్యి చీరలు నిలిచిపోయినయ్. నన్ను నమ్ముకొని 100 మంది కార్మికులు ఉన్నారు. రోజూ వచ్చి పని ఇవ్వమని అడుగుతున్నరు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. వారికేం చెప్పాలో తెలుస్తలేదు. నేయించినా ఆ చీరలు అమ్ముడుపోయేటట్లు లేదు. నా దగ్గర ఉన్న చీరలు అమ్ముడుపోతే 100 శాతం పనిచెప్తా. వాళ్ల బాధ చూడలేకపోతున్న. వేరే పని రాదు, మార్కెట్ బాగా లేదని వ్యాపారులు చెప్తున్నరు. మా సేటు మరో మూడు నెలలు చెప్పలేం అంటున్నరు. ఇలాగే ఉంటే ప్రభుత్వ సాయం కోసం నిరాహార దీక్ష తప్పదు.

సహకార వ్యవస్థ నిర్వీర్యం: తడక యాదగిరి, మాజీ సభ్యుడు, జాతీయ చేనేత మండలి

తెలంగాణలో సహకార సంఘాలు, వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. వరుస సంక్షోభాలు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వమైనా కార్మికుల బాగోగులు పట్టించుకోవాలి. చాలా జిల్లాల్లో పర్యటించాం. చేనేత కార్మిక కుటుంబాల పరిస్థిత అత్యంత దారుణంగా ఉంది. పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలి. శాశ్వత మార్కెటింగ్ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. కనీసం అధికార యంత్రాంగం కుటుంబాల దగ్గరికి వెళ్లి భరోసా కల్పించాలి. మార్కెట్ కు అనుగుణంగా పని కల్పించాలి.

Next Story

Most Viewed